Sunday, December 22, 2024

ఇప్పుడప్పుడే పార్టీ పెట్టే ఆలోచన లేదు : ప్రశాంత్ కిషోర్

- Advertisement -
- Advertisement -

Prashant Kishor announces 3000 km Padyatra

ముందుగా 3000 కి.మీ పాదయాత్ర

పాట్నా : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భారీ పాదయాత్ర చేపట్టనున్నట్టు ప్రకటించారు. వాస్తవానికి పీకే రాజకీయ పార్టీ పెట్టనున్నట్టు అనేక వార్తలు వచ్చాయి. వీటికి ఆయన సమాధానంగా ఇప్పుడప్పుడే పార్టీ పెట్టే ఆలోచన లేదని స్పష్టం చేశారు. గురువారం ఆయన స్వరాష్ట్రం బీహార్ లోని పాట్నాలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో పీకే మాట్లాడుతూ తన రాజకీయ ప్రస్థానం గురించి కొన్ని వివరాలు వెల్లడించారు. మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకుని అక్టోబర్ 2 న బీహార్ నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్టు పీకే పేర్కొన్నారు. అక్టోబర్ 2న బీహార్ లోని వెస్ట్ చంపారన్ గాంధీ ఆశ్రమం నుంచి 3000 కిమీ పాదయాత్ర ప్రారంభించబోతున్నాను. ప్రతి ఇంటికి ప్రతి కార్యాలయానికి వెళ్తాం. వాళ్ల తలుపు తట్టి సమస్యలు ఏంటో కనుక్కుంటాం. బీహార్ లోని సమస్యల గురించి అవగాహన ఉన్నవారిలో సుమారుగా 17,000 నుంచి 18,000 మందిని కలుసుకోవాలని లక్షంగా పెట్టుకున్నాను.

వారందరినీ ఒక వేదిక పైకి తీసుకురావాలనుకుంటున్నాను. దీనికి సంబంధించిన ప్రక్రియను ఆగస్టు సెప్టెంబర్ కల్లా పూర్తి చేయాలి. అని ప్రశాంత్ కిశోర్ అన్నారు. నయీ సోచ్.. నయా ప్రయాస్ ( కొత్త ఆలోచన, కొత్త ప్రయత్నం) అనే ఆలోచనా విధానంతో తాము ముందుకు వెళ్లనున్నట్టు పీకే తెలిపారు. వాస్తవానికి బీహార్‌లో ఇప్పుడప్పుడే ఎన్నికలు లేవని, అందుకే రాజకీయ పార్టీ గురించి ఇప్పుడేమీ ఆలోచించడం లేదని అన్నారు. కానీ రాజకీయ భవిష్యత్‌కు సంబంధించిన విధానాల రూపకల్పనలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే పాదయాత్రను ఎంచుకున్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. “ నేను సున్నా నుంచి ప్రారంభం అవుతున్నాను. రాబోయే మూడు, నాలుగేళ్లను పూర్తిగా ప్రజా సుపరిపాలనను తీసుకురావడానికి కేటాయిస్తాను. ఇక రాజకీయంగా ఏ పార్టీతో కలిసి వెళ్లేది లేదని పీకే ప్రకటించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూనే బీహార్‌లో అతిపెద్ద పార్టీలైన ఆర్జేడీ, జేడియూలపై విమర్శలు చేశారు. ఈ రెండు పార్టీల అధినేతలైన లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్‌లను ప్రస్తావిస్తూ విమర్శించారు.

అయితే రాజకీయ పార్టీ ఏర్పాటుపై పీకే మరో మాట అన్నారు. అందరూ ఊహించినట్టుగా తాను ఏ రాజకీయ పార్టీని ప్రారంభించడం లేదని, బీహార్‌లో మార్పు కోరుకునే వారందరినీ ఏక తాటిపైకి తీసుకురావాలన్నదే తన ఉద్దేశమని పేర్కొన్నారు. ఇక తన ప్రస్తుత ప్రస్థానంలో ఆర్థిక అవసరాల గురించి పీకే మాట్లాడుతూ మన దగ్గర ఓట్లు ఉంటే డబ్బులు సమకూర్చుకోవచ్చుఅని సమాధానం ఇచ్చారు. తనకు ఏ పార్టీపై వ్యక్తిగత విభేదాలు లేవని, నితీశ్, లాలూతోపాటు బీహార్‌లోని ఏ పార్టీ నేతలపై వ్యతిరేకత లేదని చెప్పారు. నితీశ్‌ను తనకు తండ్రిగా చెప్పుకొచ్చిన పీకే అలా అని సొంతంగా రాజకీయ వేదిక నిర్మించుకోవడంలో తప్పేం లేదంటూ వ్యాఖ్యానించారు. బీహార్ మార్పుపై తాను చేసిన వాగ్దానాలపై అనేక అనుమానాలు ఉండొచ్చని, అయితే తనకు సమయం కావాలని, తనకు ఒక అవకాశం ఇవ్వాలని ప్రశాంత్ కిశోర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News