బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బిపిఎస్‌సి) పరీక్ష రద్దు కోరుతూ పాట్నా గాంధీ మైదాన్‌లో నిరవధిక నిరాహార దీక్ష సాగిస్తున్న జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్‌ను సోమవారం తెల్లవారు జామున అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిరాహార దీక్ష సాగిస్తున్న ప్రదేశం ఆంక్షల ప్రాంతం సమీపంలో ఉన్నందున ఆ దీక్ష ‘చట్టవిరుద్ధం’ అని పేర్కొంటూ కిశోర్‌ను, ఆయన మద్దతుదారులను ఆ ప్రదేశం నుంచి తొలగించినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలియజేశారు. బీహార్ పిఎస్‌సి డిసెంబర్ 13న నిర్వహించినన పరీక్షలో ఒక ప్రశ్న పత్రం లీక్ అయిందని ఆరోపిస్తూ సాగిస్తున్న నిరాహార దీక్ష ఐదవ రోజు కిశోర్‌ను అరెస్టు చేశారు. పోలీసులు వైద్య పరీక్ష నిమిత్తం కిశోర్‌ను పాట్నా ఎయిమ్స్‌కు తీసుకువెళ్లారని జన్ సురాజ్ పార్టీ మద్దతుదారులు తెలిపారు. భద్రత సిబ్బంది కిశోర్‌ను నిర్బంధంలోకి తీసుకుంటూ ఆయనపై దౌర్జన్యం చేశారని కూడా వారు ఆరోపించారు. పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ (డిఎం) చంద్రశేఖర్ సింగ్ ‘పిటిఐ’తో మాట్లాడుతూ, ‘అవును, గాంధీ మైదాన్‌లో ధర్నాలో ఉన్న కిశోర్‌ను,
ఆయన మద్దతుదారులను పోలీసులు సోమవారం ఉదయం అరెస్టు చేశారు. వారిని కోర్టు ముందు హాజరుపరచనున్నారు’ అని తెలియజేశారు. వారు ఆంక్షల ప్రదేశానికి సమీపంలో ప్రదర్శన చేస్తున్నందున అది ‘అక్రమం’ అని డిఎం అన్నారు. ‘అధికారులు పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ వారు ఆ ప్రదేశం నుంచి వెళ్లిపోలేదు. నిరసనల నిర్వహణకు నిర్దేశించిన ప్రదేశం గర్దాని బాగ్‌కు తమ ధర్నాను మార్చాలని కూడా కోరుతూ వారికి జిల్లా అధికార యంత్రాంగం ఒక నోటీస్ జారీ చేసింది’ అని డిఎంచెప్పారు. ‘కిశోర్‌పై భద్రత సిబ్బంది దౌర్జన్యం చేయలేదు. ఆయన అరెస్టును అడ్డుకోవడానికి ప్రయత్నించిన మద్దతుదారులను మాత్రమే పోలీసులు తొలగించారు’ అని డిఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కిశోర్ మద్దతుదారులు 43 మందిని నిర్బంధంలోకి తీసుకున్నట్లు, మూడు ట్రాక్టర్లతో సహా 15 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డిఎం ఆ తరువాత విలేకరులతో చెప్పారు.