చండీగఢ్ : పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ వ్యక్తిగత ముఖ్య సలహాదారుడిగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నియమితులు అయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నియామక ఉత్తర్వులు వెలువరించారు. కిశోర్ కేబినెట్ మంత్రి ర్యాంక్ పొందుతారు. గౌరవ వేతనంగా రూ 1 పొందుతారు. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ దశలో ముందుగానే సిఎం కీలక సలహాదారుడిగా ప్రశాంత్ కిషోర్ నియామకం జరగడం కీలకం అయింది. 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయననే ముఖ్యమంత్రి అమరీందర్ ఎన్నికల వ్యూహకర్త అయ్యారు. ఎన్నికలలో సత్ఫలితాలు సాధించారు. బిజెపి చిత్తు కావడంలో ఆయన వ్యూహాలు బాగా పనిచేశాయనే పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ పశ్చిమ బెంగాల్‌లో మమత బెనర్జీ ఆధ్వర్యపు టిఎంసికి వ్యూహకర్తగా ఉన్నారు. ఈ ఎన్నికల తరువాత పంజాబ్‌లో తిరిగి అమరీందర్ పాగాపై దృష్టి కేంద్రీకరిస్తారని భావిస్తున్నారు.