బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలతో ఐక్య ఫ్రంట్
ప్రశాంత్ కిశోర్‌తో పవార్ సమాలోచన
ముంబయి: కేంద్రంలో అధికార బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టి ఐక్య ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్‌తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సమావేశమైనట్లు ఎన్‌సిపికి చెందిన మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ శనివారం వెల్లడించారు. శరద్ పవార్‌ను శుక్రవారం ఆయన నివాసంలో ప్రశాంత్ కిశోర్ కలుసుకున్నారని, దాదాపు మూడు గంటలపాటు వారు సమావేశమయ్యారని విలేకరులకు మాలిక్ తెలిపారు. ఎన్‌సిపికి వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్‌ను నియమించే విషయం వారిమధ్య చర్చకు రాలేదని ఆయన చెప్పారు. ఎన్నికల వ్యూహకర్త అయిన కిశోర్ రాజకీయ పరిస్థితులను భిన్నంగా విశ్లేషిస్తారని, ఆయన తన అనుభవాలను పవార్‌తో పంచుకున్నారని మాలిక్ చెప్పారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కిశోర్ తన అభిప్రాయాన్ని పవార్‌కు చెప్పి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రతిపక్షాల మధ్య ఐక్యత తీసుకురావాలని పవార్ కోరుకుంటున్నారని, రానున్న బిజెపికి వ్యతిరేకంగా ఒక బలమైన రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతాయని మాలిక్ తెలిపారు. రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని మార్చాలని ఉత్తర్ ప్రదేశ్ ఇప్పటికే ఒక భావనకు వచ్చారని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్లో ప్రజలు బిజెపిని తిరస్కరించారని, దీంతో సీనియర్ నాయకుడు ముకుల్ వాస్నిక్‌తో సహా పలువురు స్థానిక నాయకులు తిరిగి టిఎంసి గూటికి చేరుతున్నారని ఆయన చెప్పారు.
Prashant Kishor meets Sharad Pawar