Saturday, November 23, 2024

నితీష్‌తో ప్రశాంత్ కిషోర్ విందు సమావేశం

- Advertisement -
- Advertisement -

బిజెపికి సంకేతం ఇచ్చే రాజకీయ వ్యూహంగా చర్చ

Prashant Kishore dinner meeting with Nitish
న్యూఢిల్లీ : ఒకానొక దశలో తన రాజకీయ భవిష్యత్తు మమతాబెనర్జీతోనే అన్న ఊహాగానాలకు అవకాశం కల్పించిన ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శుక్రవారం సాయంత్రం అనూహ్యంగా తన మాజీ బాస్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ను కలుసుకోవడం మళ్లీ చర్చకు దారి తీసింది. బిజెపితో కలసి పొత్తు కుదుర్చుకుని ప్రభుత్వాన్ని నడుపుతున్న నితీష్‌కు బిజెపి నుంచి కొంత ఘర్షణను ఎదుర్కొంటున్నందున ఈ సమావేశం వెనుక రాజకీయ వ్యూహం ఉన్నట్టు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. శుక్రవారం నితీష్‌తో కలిసి ప్రశాంత్ కిషోర్ విందు సమావేశంలో పాల్గొన్నారు.

2020 లో పార్టీ సభ్యత్వం నుంచి ప్రశాంత్ కిషోర్‌ను నితీష్ తొలగించిన తరువాత ఉభయులూ సమావేశం కావడం ఇదే ప్రథమం. ఢిల్లీ లోని నితీష్ అధికారిక నివాసంలో ఇరువురూ సుమారు 2 గంటల సేపు సమావేశమయ్యారు. ఢిల్లీలో ఇద్దరూ విందు సమావేశంలో పాల్గొన్న విషయాన్ని మీడియాతో మాట్లాడుతూ నితీష్‌కుమార్ ధ్రువీకరించారు. ప్రశాంత్ కిషోర్‌తో తనకు పాత అనుబంధం ఉందని , అంతేతప్ప ఈ సమావేశం వెనుక ఏవో ఉద్దేశాలు ఊహించుకోవద్దని నితీష్ పేర్కొన్నారు. నితీష్ కుమార్ ఒమెక్రాన్ ఇన్‌ఫెక్షన్‌తో ఉన్నప్పుడు ఆయన ఆరోగ్యం గురించి ఫోనులో అడిగి తెలుసుకున్నానని, ఒకసారి ముఖాముఖిగా కలుసుకుందామని నితీష్ అనడంతో సమావేశమైనట్టు ప్రశాంత్ కిషోర్ వివరించారు.

పశ్చిమబెంగాల్‌లో మమతాబెనర్జీ సారధ్యం లోని టిఎంసి తిరిగి ఘన విజయం సాధించడానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహరచన బాగా పనిచేసింది. నితీష్‌కుమార్ జనతాదళ్ యునైటెడ్ విజయం కోసం గతంలో వ్యూహరచన చేసిన ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అయితే నితీశ్, పీకె మధ్య తరువాత సంబంధాలు క్షీణించడంతో ప్రశాంత్ కిషోర్‌ను ఆ పదవి నుంచి నితీష్ తొలగించారు.

అయితే ఇటీవల ఓ ఇంటర్వూలో నితీష్‌తో తనకున్న అనుబంధం గురించి పీకే మాట్లాడుతూ తాను తిరిగి కలసి పనిచేయాలనుకుంటున్న కొద్దిమంది నేతల్లో నితీష్ ఒకరని చెప్పడం గమనార్హం. ఇటీవల మమతాబెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి మధ్య ఏర్పడిన గందరగోళం పరిష్కారంలో పీకే చొరవ చూపారు గత ఏడాది బెంగాల్ ఎన్నికల నాటి నుంచి తృణమూల్ కాంగ్రెస్‌తో పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్‌కు చెందిన రాజకీయ సంప్రదింపుల కూటమి ఐపిఎసి మమతాబెనర్జీ అబిషేక్ బెనర్జీల మధ్య వివాదంలో ఇరుక్కుంది. ఇప్పుడు నితీష్, కిషోర్ సమావేశం రాజకీయంగా బిజెపికి ఒక సంకేతం పంపించే ప్రయత్నమే అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News