ఆయనను దరికి రానివ్వం ః జెడియూ
పాట్నా : రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బిజెపి తరఫున పనిచేస్తున్నారని , ఆయన అవసరం తమ పార్టీకి లేదని జెడియు అధ్యక్షులు రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ స్పష్టం చేశారు. తమ పార్టీ నుంచి కిషోర్‌కు ఎటువంటి ప్రతిపాదనా వెలువరించలేదని చెప్పారు. బీహార్‌లో గట్టిపట్టు సాధించాలని కుట్రలకు దిగుతోన్న బిజెపికి రాజకీయ యావల ప్రశాంత్ తెరవెనుక సాయం అందిస్తున్నారని విమర్శించారు. తనకు నితీశ్‌కుమార్ నుంచి వచ్చిన ఆఫర్‌ను తాను తిరస్కరించారని ఇటీవల ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు కట్టుకథలని తోసిపుచ్చారు. ఎన్నికల వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్ రాజకీయ కార్యకర్త కాదని, ఆయన ఓ వ్యాపారవేత్త అని, మార్కెటింగ్ వ్యూహాల ప్రకారం నడుచుకునే వ్యక్తి అని స్పందించారు. బిజెపి ఏజెంట్లుగా పనిచేస్తున్న వారిలో ఆర్‌పి సింగ్, ప్రశాంత్ కిషోర్‌లు కీలక వ్యక్తులు అని, అయితే ఇటువంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉంటామని, వీరి ఆటలు సాగనిచ్చేది లేదని జెడియు అధ్యక్షులు తెలిపారు.