పాట్నా: ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ఆదివారం బిపిఎస్‌సి పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాక ఆయన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, బిహార్ ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మద్దతును కోరారు. ప్రశాంత్ కిశోర్ విలేకరులతో మాట్లాడుతూ తాను వారిని అనుసరిస్తున్నానని, వారు విముఖంగా ఉన్నట్టయితే ఆమరణ నిరాహార దీక్షను విరమించుకుంటానని అన్నారు. ‘నేను ప్రజలకు ఒకటి స్పష్టం చేయదలచుకున్నాను. నా నిరాహార దీక్ష రాజకీయేతరమైనది. ఏ పార్టీ బ్యానర్ కింద దీనిని చేపట్టలేదు.
గత రాత్రి 51 సభ్యులున్న యువకులు ఓ వేదిక ‘యువ సంఘర్ష సమితి’(వైఎస్‌ఎస్)ని రూపొందించారు. అది ప్రశాంత్ కిశోర్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లనున్నది. మద్దతు ఇచ్చే అందరికీ స్వాగతం, అది రాహుల్ గాంధీ అయినా సరే మరొకరైనా సరే…రాహుల్ గాంధీకి 100 ఎంపీలున్నారు, తేజస్వీ యాదవ్‌కి 70కి పైగా ఎంఎల్‌ఏలు ఉన్నారు’అన్నారు. ఆయన ఇంకా ‘ఈ నాయకులు మనకంటే చాలా పెద్దవారు. వారు తలచుకుంటే గాంధీ మైదాన్‌కు ఐదు లక్షల మందిని తేగలరు. వారలా చేయడానికి ఇదే తగిన సమయం. యువకుల భవిష్యత్తు ముప్పులో ఉంది. మేము నిరంకుశ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్నాము.
మూడేళ్లలో ఈ ప్రభుత్వం 87 సార్లు లాఠీ ప్రయోగానాకి ఉత్తర్వులు ఇచ్చింది. వైఎస్‌ఎస్ అన్నది రాజకీయేతర ఫోరమ్. ఇందులో వేర్వేరు రాజకీయ పార్టీలకు చెందినవారు సభ్యులుగా ఉన్నారు’ అని వివరించారు. మోడీ ప్రధాని అయ్యాక బిహార్ యువత ఏమీ పొందలేదని ప్రశాంత్ ఆరోపించారు. ప్రశాంత్ కిశోర్ గత గురువారం నుంచి ఆమరణ దీక్ష చేస్తున్నారు. ఆయన బిపిఎస్‌సి పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. యువతకు నితీశ్ కుమార్ ప్రభుత్వం ఏదో ఒక రోజున తలవంచక తప్పదని కూడా ఆయన అన్నారు. పాట్నాలోని 22 కేంద్రాలలో రీఎగ్జామ్ పెట్టారు. మొత్తం 12012 మంది అభ్యర్థులలో కేవలం 5943 మంది విద్యార్థులే రీఎగ్జామ్‌కు హాజరయ్యారు. రీఎగ్జామ్ అన్ని కేంద్రాలలో ప్రశాంతంగానే జరిగిందని బిపిఎస్‌సి శనివారం జారీచేసిన ప్రకటనలో పేర్కొంది.