దేశాన్ని దశాబ్దాల పాటు పాలించి చివరికి అంతటా ప్రజాభిమానాన్ని కోల్పోయి, నీరసించి మూలబడిపోడానికి సిద్ధంగా వున్న కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు తన శక్తి మీద నమ్మకాన్ని కోల్పోయింది. పొత్తులకు విముఖంగా వుండి సొంతంగానే తిరిగి దేశాధికారంలోకి రాగలననే ధీమాతో అది చాలా కాలాన్ని వృథా చేసింది. మొన్నటి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడా కనీస స్థాయిలోనైనా నిరూపించుకోలేకపోడంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పరాభవం తప్పదనే భయం పట్టుకొని ఈ ఊబిలోంచి బయటపడడానికి ఏ కొమ్మనైనా ఆశ్రయించాలని నిర్ణయించుకున్నది. ఇటీవలి గతంలో ఒకసారి తన తలుపు తట్టి నిరాశకు గురైన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను ఆశ్రయించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించుకున్నట్టు రూఢి వార్తలు చెబుతున్నాయి.
నేరుగా సోనియా, రాహుల్ గాంధీలతోనే మాట్లాడిన అనుభవమున్న ప్రశాంత్ కిశోర్ కూడా కాంగ్రెస్‌లో చేరాలనే నిర్ణయించుకున్నట్టు సమాచారం. అయితే ఆచరణలో ఇది ఎటు దారి తీస్తుందో చూడాలి. ఎవరికి వారు తమకు ఎదురులేదని భావించే వారితో కిక్కిరిసిపోయిన కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిశోర్ సలహాలను ఎంత వరకు అంగీకరిస్తారనేది ముఖ్యమైన ప్రశ్న. కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎ ఎనిమిదేళ్ల క్రితం వరకు దేశాన్ని వరుసగా రెండు సార్లు పాలించినపుడు మంచి పదవులు అనుభవించినవారే ఆ పార్టీ అధికారానికి దూరమైపోడంతోనే అంతర్గతంగా తిరుగుబాటు జెండా ఎగురవేశారు. కపిల్ సిబల్ వంటి సీనియర్లే బృందంగా ఏర్పడి అధిష్ఠానానికి బహిరంగ ప్రశ్నలు సంధిస్తూ వచ్చారు. అందుచేత కాంగ్రెస్ సభ్యులను, నేతలను ఒక గాడిన పెట్టి పార్టీకి నూతన జవసత్వాలు కల్పించడంలో ప్రశాంత్ కిశోర్ ఎంత వరకు సఫలీకృతుడు కాగలుగుతారనే ప్రశ్న సహజంగానే తలెత్తుతున్నది.
ఎటువంటి షరతులు పెట్టకుండా కాంగ్రెస్‌లో చేరడానికి ప్రశాంత్ కిశోర్ సంసిద్ధతను ప్రకటించారని, అలాగే ఒక్క సోనియా గాంధీకి మాత్రమే జవాబుదారీగా వుండాలని ఆయన నిర్ణయించుకున్నారని, పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను ప్రశాంత్ కిశోర్‌కు అప్పజెప్పనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంకొక వైపు సోనియా గాంధీ కుటుంబస్థులెవరూ పార్టీ అధ్యక్ష పదవిలో వుండరాదని, యుపిఎ చైర్ పర్సన్, పార్లమెంటరీ బోర్డు అధ్యక్ష పదవి, ప్రధాన కార్యదర్శి (సమన్వయం) పదవులు మూడూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు చేపట్టాలని ప్రశాంత్ కిశోర్ సూచించినట్టు తెలుస్తోంది. దేశ ఓటర్లలో 45 శాతం మందిని లేదా 30 కోట్ల మందిని పార్టీ ఆకట్టుకోవాలని కూడా సలహా ఇచ్చినట్టు వార్తలు చెబుతున్నాయి. కాంగ్రెస్ ఆశయాల పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తులతో దేశ వ్యాప్తంగా 543 డిజిటల్ జోన్లు ఏర్పాటు చేసి పార్టీ తరపున పటిష్ఠమైన ప్రచారం జరిగేటట్టు చూడాలని ఆయన సలహా ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు కాంగ్రెస్ నాయకత్వానికి కూలంకషమైన నివేదిక సమర్పించారని చెబుతున్నారు.
బిజెపి ప్రజలను మతపరంగా విభజించి మెజారిటీ హిందూ ఓటు మీద ఎన్నికల్లో గెలుపొందే వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేయగలుగుతున్నది. మైనారిటీల పట్ల వ్యతిరేకతను తీవ్ర స్థాయికి తీసుకెళితేగాని 2024 సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోసారి దేశాధిపత్యాన్ని చేపట్టడం సులభం కాదనే దృష్టితో అది పావులు కదుపుతున్నది. అందుకనుగుణంగా లౌజిహాద్, హిజాబ్ వ్యతిరేకత వంటి వ్యూహాలను పన్ని హిందూ ఓటును కూడగట్టడంలో సఫలమవుతున్నది. ఈ వరుసలో తాజాగా ఢిల్లీ జహంగీర్‌పురిలో అల్లర్ల నిందితుల ఇళ్ల కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘించి ఈ విద్వేష కార్యక్రమాన్ని జరిపించింది. దాని సంచిలో ఇంకెన్ని ఇటువంటి కుట్రలున్నాయో తెలియదు. ఇలా విద్వేషాన్ని రగిలిస్తూ పోడం ద్వారా దేశంలో కనీవినీ ఎరుగని ఉద్రిక్త పరిస్థితిని అది సృష్టిస్తున్నది. నిరక్షరాస్యులు విశేషంగా వున్న మన దేశంలో భక్తి, దేవుడి మీద విశ్వాసం అనేవి ఎన్నికల్లో రాజకీయ పక్షాలకు అనువుగా అమరిన తురుపు ముక్కలుగా రుజువు చేసుకుంటున్నాయి. ఈ కార్డును ప్రయోగించడంలో బిజెపి సిద్ధహస్తురాలైంది.
దీనిని నామరూపాల్లేకుండా చేయగలిగేవారే ఆర్థికంగా, రాజకీయంగా అత్యంత బలమైన స్థానంలో వున్న భారతీయ జనతా పార్టీని దేశాధికారం నుంచి తొలగించగలుగుతారు. ఈ పనిని చేయగల సత్తా కాంగ్రెస్‌కు వున్నట్టు ఎంత మాత్రం భావించలేము. మరోవైపు సాంఘికంగా అణగారిన వర్గాల మద్దతును కాంగ్రెస్ కోల్పోయి చాలా కాలమైంది. ఒకప్పుడు తన వెంట వున్న ఎస్‌సిలు, ముస్లింలు ఇప్పుడు దానికి దూరమయ్యారు. మరో అతి పెద్ద వర్గమైన బిసిలు కాంగ్రెస్‌కు ఎప్పుడూ ఎడంగానే వుంటారు. వారిలో కొంత భాగం బిజెపి వెంట వున్న మాట కూడా వాస్తవం. ఈ సాంఘిక ముఖ చిత్రాన్ని మార్చగలిగే సత్తా కాంగ్రెస్‌కు వున్నదని ఆశించలేము. మొదటి నుంచి అగ్రవర్ణాల పట్టులో గల కాంగ్రెస్‌ను అట్టడుగు వర్గాల దగ్గరకు ప్రశాంత్ కిశోర్ తీసుకుపోగలరా?