Friday, November 22, 2024

ఎన్నికల ప్రసంగం

- Advertisement -
- Advertisement -

దేశ మొట్టమొదటి ఆదివాసీ అధ్యక్షురాలు (రాష్ట్రపతి) ద్రౌపది ముర్ము చేత అనేక అబద్ధాలు, ప్రగల్భాలు పలికించిన ఖ్యాతిని ప్రధాని మోడీ ప్రభుత్వం మూటగట్టుకొన్నది. ఈ రోజున భారతీయ పౌరులందరిలో ఆత్మవిశ్వాసం వెల్లివిరుస్తున్నదని, మన దేశం పట్ల ప్రపంచ దృక్పథంలో అతి పెద్ద మార్పు వచ్చిందని ఆమె చెప్పిన దానిలో వాస్తవం ఎంతో అందరికీ తెలుసు. అనూహ్యంగా పెరిగిన ధరలు, నిరుద్యోగం, నిలువెల్లా గాయపడిన మత సామరస్యం, మటుమాయమైన సెక్యులరిజం దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాయని ఎలా అనుకోగలం? 2002 నాటి గుజరాత్ అల్లర్లలో హిందూత్వ శక్తులు రెచ్చిపోడం వెనుక అప్పటి ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ హస్తం వున్నదని చాటిచెప్పిన బిబిసి డాక్యుమెంటరీని తొక్కి పెట్టడంలో స్పష్టపడిన మన కేంద్ర పాలకుల నిజస్వరూపాన్ని ప్రపంచం కళ్లారా చూస్తున్నది. రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నట్టు ఇప్పుడు భారత దేశంపై ప్రపంచ దృక్పథం గతంలో వున్నదాని కంటే విరుద్ధంగా వున్న మాట వాస్తవమే! అప్పుడున్న ప్రజాస్వామిక విలువలకు సమాధి నిర్మాణం పరిపూర్ణ స్థాయికి చేరుకొంటున్న చేదు వాస్తవాన్ని దేశ దేశాలు గమనించి వుంటాయి.

భారతీయ మహిళ గురించి ద్రౌపది ముర్ము శ్లాఘించిన తీరు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ల మనువాద దృక్పథాన్ని చాటుతున్నది. మన మహిళలు వేరెవరికీ తీసిపోరని మొత్తం ప్రపంచంలోనే అరుదైన వారి ఘనమైన కీర్తి యుగాల తరబడి చెక్కుచెదరకుండా వుంటుందని ముర్ము అన్నారు. భారతీయ మహిళ అనేక సమస్యలతో సతమతమవుతున్నదని, దారుణమైన లింగ వివక్షకు బలి అవుతున్నదని, ఆమెపై వరకట్న వేధింపులు, లైంగిక దాడులు సర్వసాధారణమైపోయాయని, అవిద్యతో అలమటిస్తున్నదని, అన్నింటా పురుషుని దయాదాక్షిణ్యాలపై ఆధారపడవలసిన ద్వితీయ శ్రేణి పౌర సత్వాన్నే అనుభవిస్తున్నదని అంతర్జాతీయ సమాజం పేర్కొంటున్న సంగతి తెలిసిందే. పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యానికి సంబంధించి ప్రపంచంలోని 193 దేశాల్లో ఇండియా అత్యల్పంగా 148వ స్థానంలో వున్నదని ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ (ఐపియు) నివేదిక నిర్ధారించింది. అవినీతి అనేది ప్రజాస్వామ్యానికి, సామాజిక న్యాయానికి అతి పెద్ద శత్రువని చెప్పిన రాష్ట్రపతి తన ప్రభుత్వం గత కొద్ది సంవత్సరాల్లో అవినీతితో అవిశ్రాంత పోరాటం చేసిందని వెల్లడించారు.

సమాజంలోని అవినీతిపరులకు ఎటువంటి సానుభూతి లభించని రీతిలో దేశ ప్రజల్లో సామాజిక చైతన్యం పెరుగుతున్నదని ముర్ము ప్రకటించారు. ఆమె ఈ ప్రసంగాన్ని చదువుతున్న సమయంలోనే ప్రపంచ అత్యంత సంపన్నుల్లో మూడవ వ్యక్తిగా గుర్తింపు పొందిన గౌతమ్ అదానీ స్టాక్ మార్కెట్‌లో అక్రమాలకు పాల్పడి తన సంపదను పెంచుకొన్నట్టు ఒక అమెరికన్ సంస్థ సాక్షాధారాలతో సమర్పించిన నివేదికపై దేశంలో చర్చ జరుగుతున్నది. ఇటువంటి భారీ అవినీతిపై తక్షణమే దర్యాప్తుకి ఆదేశించి వుండవలసిన ప్రధాని మోడీ ప్రభుత్వం మౌనాన్ని పాటిస్తున్నది. గతంలో డికె బారువా ‘ఇండియాయే ఇందిర, ఇందిరయే ఇండియా’ అని సిగ్గు విడిచి ప్రకటించారు. అదే విధంగా తనపై దాడి ఇండియాపై దాడి అని గౌతమ్ అదానీ చెప్పుకోడం ఆయన అవినీతి వెనుక వున్న అధికార హస్తాన్ని రూపు కట్టిస్తున్నది.

రాష్ట్రపతి ప్రసంగం ఈ విషయాన్ని బొత్తిగా పట్టించుకోకపోడం విడ్డూరం కాదు. సరిహద్దులలో చైనా, పాకిస్తాన్‌ల దుశ్చర్యలను గట్టిగా ఎదుర్కొంటున్నట్టు, వాటికి దీటైన జవాబు ఇస్తున్నట్టు రాష్ట్రపతి చెప్పారు. చైనా సరిహద్దులోని మన 26 సైనిక స్థావరాలతో సంబంధాలు తెగిపోయాయన్న వార్త వాస్తవాన్ని చాటుతున్నది. ప్రధాని మోడీ ప్రభుత్వం రైతులకు ఏడాదికి కొద్దిపాటి నగదును విదిలించడం, పేదలకు ఐదేసి కిలోలు బియ్యం ఇవ్వడాన్నే రాష్ట్రపతి సామాజిక న్యాయంగా భావిస్తున్నట్టు అర్థమవుతుంది. తరతరాలుగా అత్యంత హేయమైన చిన్నచూపుకి గురై సామాజిక దోపిడీకి దొరికిపోయి అణగారిపోయిన దేశ జనాభాలోని అత్యధిక శాతం ప్రజలకు ఉత్తమ శ్రేణి ఉచిత విద్య, వైద్యం కల్పించి జీవన సమస్యలను ఎదుర్కోడంలో వారి శక్తిసామర్థాలను గణనీయంగా పెంచి ఆ మేరకు దేశంలో అసమానతలను తొలగించడమే అసలు సిసలైన సామాజిక న్యాయం అవుతుంది. దురదృష్టవశాత్తు ఆమె తన ప్రభుత్వమని చెప్పుకొన్న ప్రధాని సర్కారు నైజం అణగారిన వర్గాలను మరింతగా అణగదొక్కడమేనని సందేహాతీతంగా రుజువైంది. శిథిల గృహానికి వెల్లవేసి అలంకరించినట్టు ప్రధాని మోడీ ప్రభుత్వ నిజస్వరూపాన్ని దాచివేసి ఆయనది గొప్ప పాలనగా చూపించడానికి రాష్ట్రపతి ప్రయత్నించారు. 2024 పార్లమెంటు ఎన్నికలకు ముందు ప్రజల దృష్టిలో దాన్ని ఉన్నతమైనదిగా చూపించడానికి చేసిన యత్నమే ఇది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News