115 రోజులు మృత్యువుతో పోరాడి విజయం
న్యూఢిల్లీ: నెలలు నిండక ముందే 704 గ్రాముల బరువుతో జన్మించిన ఒక నవజాతశిశువు పలు రకాల ఇన్ఫెక్షన్లు, గుండె సమస్యలు, బ్రెయిన్ హెమరేజ్ వంటి వివిధ అనారోగ్య సమస్యలపై దాదాపు నాలుగు నెలలపాటు సుదీర్ఘ పోరాటం చేసి సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. వైద్య చరిత్రలో అత్యంత అరుదైన ఈ ఘటన న్యూఢిల్లీ వసంత్ కుంజ్‌లో ఉన్న ఫోర్టీస్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఒక మహిళకు కృత్రిమ గర్భధారణ ద్వార కవల శిశువులు జన్మించారు. అయితే..పుట్టిన కొద్ది నిమిషాలకే ఒక బిడ్డ మరణించగా మరో బిడ్డలో అనేక అనారోగ్య సమస్యలు కనిపించడంతో ఆ బిడ్డను ఐసియులో ఉంచారు. ఆ బిడ్డకు పుట్టుకతోనే అనేక రకాల ఇన్ఫెక్షన్లతోపాటు గుండె సంబంధిత సమస్యలు, మెదడులోని రక్తనాళాలలో లోపాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించి వెంటనే చికిత్స ప్రారంభించారు.
12 సార్లు ఆ బిడ్డకు రక్త మార్పిడి జరిగింది. 115 రోజుల తర్వాత సంపూర్ణ ఆరోగ్యంతో ఆ బిడ్డను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ఫోర్టీస్ పీడియాట్రిక్ అండ్ నియోనాటాలజీ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ నాగ్‌పాల్ ఒక ప్రకటనలో తెలిపారు. నెలలు నిండకముందే ఆరవ నెలలోనే(25 వారాల గర్భం) కవలలు జన్మించారని, ఇటువంటి సందర్భాలలో శిశువు బతికే అవకాశాలు 50 శాతం మాత్రమే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. 115 రోజుల వైద్య చికిత్సల అనంతరం 1.8 కిలోల బరువున్న బిడ్డను ఢిశ్చార్జ్ చేసినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆ బిడ్డలో అన్ని అవయవాలు సాధారణంగా పనిచేస్తున్నాయని, ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని ఆయన పేర్కొన్నారు.