Monday, December 23, 2024

ప్రికాషన్ డోసు పంపిణీ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

రెండు డోసులు ఏ టీకా వేసుకుంటే అదే

Precaution vaccine dose for people

న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రికాషన్ ( ముందు జాగ్రత్త ) డోసు పంపిణీ సోమవారం నుంచి ప్రారంభమైంది. ఆరోగ్యసిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లతోపాటు 60 ఏళ్లు పైబడిన, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి నేటి నుంచి ఈ డోసు వేస్తున్నారు. ఈ టీకా కోసం మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ ఇటీవల వెల్లడించింది. శనివారం సాయంత్రం నుంచే కొవిడ్ పోర్టల్‌లో ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్లను ప్రారంభించారు. నేటి నుంచి టీకా కేంద్రానికి వెళ్లి కూడా స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని ఆరోగ్యశాఖ తెలియజేసింది. ప్రికాషన్ డోసుకు మిక్సిడ్ వ్యాక్సినేషన్ ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ డోసుకు అర్హులైన వారు తొలి రెండు డోసులు ఏ టీకానైతే తీసుకున్నారో ఇప్పుడు కూడా అదే టీకా తీసుకోవాలని తెలియజేసింది. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రెండో డోసు తీసుకున్న 9 నెలల తరువాత ప్రికాషన్ డోసు వేయించుకోవాల్సి ఉంటుంది.

60 ఏళ్లు పైబడిన వయోవృద్ధులు,ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఈ డోసు కోసం వైద్యుల ధ్రువీకరణ పత్రాలు చూపించాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ వివరించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అంచనాల ప్రకారం 1.05 కోట్ల ఆరోగ్య కార్యకర్తలు, 1.9 కోట్ల ఫ్రంట్‌లైన్ వర్కర్లు , 2.75 కోట్ల సీనియర్ సిటిజన్లు ఈ అదనపు డోసును పొందనున్నారు. ఇప్పటికే వీరికి ప్రికాషన్ డోసుల గురించి మెసేజ్‌లు పంపినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆదివారం ట్విటర్‌లో వెల్లడించారు. మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ సిబ్బందిని కూడా ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా పరిగణించి వారికి కూడా ప్రికాషన్ డోసు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. నేటి నుంచి వారికి కూడా ఈ డోసు అందిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News