దోమ చూడడానికి చిన్నగా కనిపించినా తీసుకువచ్చే వ్యాధులు ప్రాణాంతకమైనవే. డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు దోమల వల్లనే వ్యాపిస్తుంటాయి. ప్రపంచ ఆరోగ్యసంస్థ అంచనా ప్రకారం ఏటా 150 లక్షల మలేరియా కేసులు నమోదవుతున్నాయి. 19,000 నుంచి 20,000 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. దోమలు విపరీతంగా వ్యాపించిన ప్రాంతాల్లో దోమల నివారణ మందు వాడుతుంటారు. ఇళ్లల్లో పడుకునేటప్పుడు మస్కిటో కాయిల్స్ వెలిగిస్తుంటారు. ఆ పొగవల్ల ఉక్కిరిబిక్కిరై ప్రాణాలు పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. గుర్‌గావ్‌లో ఒకాయన తన గదిలో దోమల నివారణ మందును చాలా స్ప్రే చేయడంతో ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
ఢిల్లీ ఉత్తర ప్రాంతంలో శాస్త్రి పార్కు ఏరియాలో ఒక ఇంట్లో బెడ్‌షీట్‌పై మస్కిటో కోయిల్ పడిపోవడంతో విష పూరిత పొగ కమ్ముకుని ఊపిరాడక ఆరుగురు స్పృహ తప్పి పడిపోయారు. ఆ తరువాత చనిపోయారు. నాసిక్ లో 14 నెలల పసివాడు తన ఇంట్లో ఆడుకుంటూ దోమల మందు తాగడంతో చనిపోయాడు.ఇవన్నీ పరిశీలిస్తే దోమల నివారణకు మందులను సరిగ్గా వినియోగించక పోతే ఎంతటి ప్రమాదమో తెలుసుకోవాలి. దోమల నివారణకు ఏ రూపంలో మందులు వాడినా ఎక్కువైతే ఆరోగ్యానికి తీరని ముప్పు తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మస్కిటో కాయిల్స్, ద్రవ రూపంలో ఉన్న వేపరైజర్ కలిగిన ఎలెక్ట్రిక్ మెషిన్లు, అలాగే స్కిన్ క్రీమ్లు, వంటివి వాడితే ప్రమాదమే జరుగుతుందని హెచ్చరిస్తున్నారు.
దోమలను నాశనం చేసే ఈ వికర్షకాలలో కార్బన్ మోనాక్సైడ్ వంటి విషపూరిత వాయువులు ఉంటాయి. ఎలాంటి వెంటిలేటర్లు లేని, తలుపులన్నీ మూసివేసి ఉన్న గదిలో వీటిని పీలిస్తే ఉక్కిరిబిక్కిరై ఊపిరితిత్తులకు హాని జరుగుతుంది. ఈ వాయువులు రక్తంలో చేరి గుండెకు అంటుకుంటాయి. ముఖ్యంగా ఆస్తమా, గుండెజబ్బు, డయాబెటిస్ రోగులు, గర్భిణులకు ఎంతో ప్రమాదాన్ని తీసుకొస్తాయి. అందువల్ల అన్నిటికన్నా మేలైనవి దోమ తెరలు వాడడమే.
మురికి నీరు ఎక్కడైతే నిల్చిపోతుందో అక్కడ దోమలు విపరీతంగా పెరుగుతుంటాయి. ఇంటిపరిసరాలను శుభ్రంగా ఉంచడమే కాకుండా, నీరు నిల్వకుండా చూడడం చాలా ముఖ్యం. యాంటీ లార్వా స్ప్రేయర్స్ దోమల లార్వాను నాశనం చేయడానికి వినియోగిస్తారు. దోమల నివారణ మందుల్లో సాధారణంగా డిఇఇటి (deet )అనే మూలకాన్ని వాడుతుంటారు. ఇది చర్మానికి మంట, దురదలు, పుట్టిస్తుంది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు.
జాగ్రత్తలు…
దోమల మందు సీసాపై వ్రాసిన జాగ్రతలు చదవాలి. అత్యధిక వినియోగం పనికిరాదు. ఇళ్లల్లో ఈ మందు కానీ కాయిల్స్ కానీ వాడేటప్పుడు వెంటిలేషన్ బాగుండాలి.గాలి వెలుతురు సరిగ్గా లేకుంటే వాడరాదు. చర్మంపై తగిలేలా నేరుగా స్ప్రీచేయరాదు. పిల్లలు, పెంపుడు జంతువులు ఉన్న చోట జాగ్రత్తగా వాడుతుండాలి. దోమ తెరలను మంచాలపై మీద అమర్చుతారు. కొందరు తెరలను ద్వారాలకు, కిటికీలకు కూడా వాడుతుంటారు. ఏదెలాగున్నా కర్పూరం , అగరుబత్తి వెలిగించినా, గదిలో వెంటిలేషన్ బాగా ఉండాలన్నది మర్చిపోవద్దు. నిమ్మగడ్డి, నిమ్మగడ్డి ఆయిల్ సహజసిద్ధమైన దోమల నివారిణులే.