Thursday, January 23, 2025

సముద్ర ఉష్ణోగ్రతలపై రుతుపవనాల అంచనా

- Advertisement -
- Advertisement -

రుతుపవనాల సమయంలో ఏమాత్రం వర్షం కురుస్తుందో ముందుగా అంచనా వేయడానికి సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను (ఎస్‌ఎస్‌టి) పరిగణన లోకి తీసుకోవడం గత కొన్నేళ్లుగా పరిపాటిగా వస్తోంది. సుదీర్ఘకాల ప్రమాణం 887.5 మి.మీ కన్నా ఎక్కువా లేక తక్కువా ఎంత కురుస్తుందో అంచనా వేయడానికి ఎస్‌ఎస్‌టి పద్ధతిని పాటిస్తుంటారు. అయితే ఈ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల కొలమానం కన్నా సముద్ర అంతర్గత ఉష్ణోగ్రతల (ఓషన్ మీన్ టెంపరేచర్‌ఒఎంటి) కొలమానమే కచ్చితంగా అంచనా వేయగలుగుతుందని పుణె ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటెయొరాలజీ (ఐఐటిఎం) శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

ఎస్‌ఎస్‌టి, ఒఎంటి విధానాల మధ్య పోలికలను విశ్లేషిస్తూ ఎస్‌ఎస్‌టి వల్ల 60 శాతం కచ్చితంగా ఫలితాలు సాధిస్తుండగా, ఒఎంటి వల్ల 80 శాతం ఫలితాల రేటు లభిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంతేకాక, కచ్చితంగా అంచనా వేయడానికి సుదీర్ఘకాల ప్రమాణం మేరకు వర్షం ఎంత పడుతుందో ఏప్రిల్ ప్రారంభం లోనే తగిన సమాచారం లభిస్తుంది. అంటే నైరుతి పవనాలు రాడానికి రెండు నెలల ముందుగా తెలుస్తుంది. ఎందుకంటే సముద్ర వేడి శక్తి జనవరిమార్చి మధ్యకాలంలో కొలవడం ద్వారా సముద్ర అంతర్గత ఉష్ణోగ్రత (ఒఎంటి) లను విశ్లేషించడమౌతుంది.

ఏటా కేరళలో జూన్ నెలలో నైరుతి పవనాలు వీస్తుంటాయి. సముద్రం పైని ఆవరించిన పలుచని పొర తాలూకు సమాచారాన్నే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు (ఎస్‌ఎస్‌టి ) అందిస్తాయి తప్ప సముద్రంలో దాగి ఉన్న వేడిని ప్రతిబింబించవు. సముద్రంపై ఆవరించిన వేడిశక్తి పరిస్థితుల తేడాలే ప్రధానంగా వేసవి రుతుపవనాలకు కారణమవుతుంటాయని ఐఐటిఎం శాస్త్రవేత్తలు చెప్పారు. పరిశోధకులు 1993 నుంచి 2017 వరకు 25 ఏళ్లకు సంబంధించి ఒఎంటి డేటాను విశ్లేషించారు. ఎస్‌ఎస్‌టి వలె కాకుండా ఒఎంటి 25 ఏళ్లలో 20 ఏళ్లు కచ్చితంగా అంచనా వేయగలిగింది.

(80 శాతం సత్ఫలితాలు). ఇదే విధంగా ఎస్‌ఎస్‌టి ఫలితాలను విశ్లేషించగా 25 ఏళ్లలో 15 ఏళ్లు మాత్రమే కచ్చితంగా అంచనాలు వెలువడ్డాయి. అంటే 60 శాతం మాత్రమే ఫలితాలు వచ్చాయి. ఎస్‌ఎస్‌టి ఫలితాలతో పోల్చుకుంటే వర్షపాత సంవత్సరాల్లో సరాసరి కన్నా ఎక్కువ లేదా తక్కువ వర్షపాతం అంచనా వేయడంలో ఒఎంటి చాలా మెరుగైన సత్ఫలితాలు అందించింది. హిందూ మహాసముద్రంలో వాతావరణ పోకడ గురించి కూడా అధ్యయనం చేస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల హిందూమహా సముద్రంలో ఒకవైపు వెచ్చగా, మరోవైపు చల్లగా జలాలు ఉంటాయని , దీనివల్ల కొన్నిసార్లు తూర్పు ఆఫ్రికాలో కరవులు, ఇండోనేషియాలో భారీ వరదలు సంభవిస్తుంటాయని చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News