ఎక్సైజ్, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
పాలమూరు: తెలంగాణలో కుల వృత్తులకు ప్రాధాన్యం కల్పిస్తున్నామని ఎక్సైజ్, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అయ్యప్పగుట్టపై జిల్లా టీపోపా, పద్మశాలి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 42 కుల సంఘాలకు భూమి ఇవ్వడం జరిగిందన్నారు. మార్కండేయ దేవాలయంతో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ ఉన్నతంగా ఎదగాలని కోరారు. నేత వృత్తి ఎంతో నైపుణ్యమైనది వివరించారు. గత ప్రభుత్వాలు నేత వృత్తిని పట్టించుకోలేదన్నారు. టీఆర్ఎస్ పాలనలో అన్ని కులవృత్తులకు ప్రాధాన్యం కల్పిస్తున్నామన్నారు. జాండ్ర సంఘానికి రూ.15లక్షలు, ఒక ఎకరా భూమి కేటాయించామన్నారు. పనిచేసేవాళ్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
సహాయం చేసేవాళ్లకు అండగా ఉంటే భగవంతుడు కూడా శక్తిని ఇస్తాడని పేర్కొన్నారు. ప్రతి సోమవారం ఖాదీ దుస్తులు ధరిస్తున్నామని తెలిపారు. చేనేత దుకాణాలకు రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని, చాలామందికి ఉపాధి కూడా దొరుకుతుందని పేర్కొన్నారు. ఖాదీ దుస్తులు ధరించడం వల్ల చర్మ వ్యాధులు దూరం అవుతాయని వివరించారు. పనిచేసే నాయకుడు గెలుపొందితే ఎంతో అభివృద్ధి జరుగుతుందన్నారు. కెసిఆర్ ఏకో పార్కు 2000 ఎకరాలలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా అన్నివిధాలా అభివృద్ధిని చూసి ఎంతో మంది సంబరపడిపోతున్నారని తెలిపారు. పుట్టడం గిట్టడం గొప్పకాదు ఈ మధ్యకాలంలో ఎన్నో మంచి పనులు చేయడం, నలుగురు మేలు చేయడం గొప్ప అని పేర్కొన్నారు.
జిల్లాలో అన్ని కులాలకు చేయూతనిస్తున్నామని భవిష్యత్తులో కూడా ఆదుకుంటామని తెలిపారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం పద్మశాలి సంఘానికి సంబంధించిన క్యాలెండర్, టిపోపా క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అంతకు ముందు రూ.5లక్షల నిధులతో శివమార్కండేయ దేవాలయం వద్ద సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.10లక్షల నిధులతో నిర్మించిన పద్మశాలీ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. పద్మశాలీ కల్యాణ మండప నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా శివమార్కండేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోరమోని నర్సిములు, పద్మశాలీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రావు, పట్టణ అధ్యక్షుడు అనంతరాములు, పానుగంటి బాల్‌రాజ్, భీంపల్లి శ్రీకాంత్, సుకుమార్, కౌన్సిలర్ రోజా వెంకటేశ్, గుర్రం బాల్‌రాజ్, బోగ కోదండపాణి, పులి అంజనమ్మ, తదితరులు పాల్గొన్నారు.