గువహతి : పాపం గజరాజలు.. అడవిలో దర్జాగా తిరిగే ఏనుగులు దారితప్పి రోడ్లపైకి వచ్చి మృత్యుశకటాల వంటి వచ్చిపోయే వాహనాలకు బలి అవుతున్నాయి.ఈ మూగజీవాలు ఆహరం కోసం బయటకు వచ్చినప్పుడు పంట పొలాల వద్ద కాపలాలు , బెదిరింపులతో దారితెన్నూలేకుండా తిరుగుతున్నాయి. అసోంలో ఓ ఆడ ఏనుగు గురువారం రైల్వే ట్రాక్ దాటుతూ ఉండగా గూడ్స్ రైలు వచ్చి బలంగా తగిలింది. దీనితో ఏనుగు అక్కడికక్కడే మృతి చెందింది. అసోంలోని కామ్‌రూప్ మెట్రోజిల్లాలోని సోనాపూర్ ప్రాంతంలో ఏనుగు బలి అయింది. అక్కడి అమ్చంగ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నుంచి ఈ ఏనుగు బయటకు వచ్చినట్లు గుర్తించారు.
ఇదే విధంగా ఈ ఒక్కరోజే మొత్తం మూడు ఏనుగులు దుర్మరణం చెందాయి. ఇప్పుడు చనిపోయిన ఏనుగులలో ఒకటి గర్భిణి అని కూడా తెలిసింది. స్థానికులు కొందరు ఈ గజరాజు కళేబరానికి పూలు పండ్లు ఉంచి తరువాత భక్తితో ఖననం చేశారు. మరోచోట ఏనుగులు హైటెన్షన్ కరెంటు వైర్లు మీదపడటంతో మృతిం చెందాయి. స్తంభాలను ఇవి కుదిపేయడంతో తీగెలు తెగినట్లు వెల్లడైంది. కాగా పలు చోట్ల రైతులు తమ పంటలు జంతువుల పాలుకాకుండా ఉండేందుకు కరెంటు వైర్లు పొలం చుట్టూ అమర్చడం కూడా ఈ మూగజీవాలకు ప్రాణసంకటం అవుతోంది. ఘీంకరిస్తూ విలవిలలాడుతూ ఇవి కుప్పకూలుతున్నాయి.