అర్ధరాత్రి దాటినా పడుకునే వరకు చదవడం లేదా టివి స్క్రోలింగ్ చూడడం చాలామందికి అలవాటు. అయితే గర్భిణులు మాత్రం ఎంతవేగం లైట్లు స్విచాఫ్ చేసి పడుకుంటే అంతమంచిదని, గర్భస్థ మధుమేహం దాపురించకుండా ఉంటుందని పరిశోధకులు సూచిస్తున్నారు. రాయల్ కాలేజీ ప్రసూతి వైద్యులు, గైనకాలజిస్టుల అధ్యయనం ప్రకారం గర్భస్థ మధుమేహం ప్రతి వంద మంది మహిళల్లో కనీసం నలుగురు లేదా ఐదు మందికైనా గర్భిణి సమయంలో గర్భస్థ మధుమేహ ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఇది అంతగా నియంత్రణ కాక, కడుపులో ఉన్న శిశువుకు అనారోగ్యసమస్యలకు , ఇతర సమస్యలకు దారి తీస్తుందని వారు సూచించారు.
గర్భిణులు ఎవరైతే నిద్రపోడానికి మూడు గంటల ముందు లైట్ ఎక్కువ కాంతికి ప్రభావితులౌతారో వారు గర్భస్థ సమయంలో మధుమేహం బారిన పడతారని అమెరికన్ జర్నల్ ఆఫ్ అబ్‌స్టెట్రిక్స్, గైనకాలజీ మేటర్నల్ ఫీటల్ మెడిసిన్ లో వెలువడిన అధ్యయనం హెచ్చరించింది. రాత్రి పూట లైట్ గర్భిణులకు గుర్తింపు కాని రిస్కును తెచ్చి పెడుతుందని నార్త్ వెస్టర్న్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ మింజీ కిమ్ వెల్లడించారు. ఇదివరకటి అధ్యయనాలు ఎవరైతే రాత్రుళ్లు బయట కృత్రిమ కాంతుల్లో షిఫ్టు డ్యూటీలు చేస్తారో వారికి టైప్ 2 డయాబెటిస్ రిస్కు ఎక్కువగా ఉంటుందని హెచ్చరించాయి.
రాత్రుళ్లు ఎక్కువసేపు లైట్‌కు ప్రభావితమైతే మెలాటొనిన్ అనే హార్మోన్ స్థాయిలను బాగా తగ్గించి వేస్తుందని, శరీరం లోని అంతర్గత గడియారం పని విధానాన్ని భగ్నం చేస్తుందని ఇదివరకటి పరిశోధనలో కనుగొన్నారు. బ్లడ్ సుగర్ స్థాయిల క్రమబద్ధీకరణ వంటి జీవ సంబంధ కార్యక్రమాలను పాడు చేస్తుందని పరిశోధనలో కనుగొన్నారు. అయితే ఈ అధ్యయనంలో ఇవన్నీ రుజువు చేయలేక పోయినప్పటికీ, అటువంటి వ్యవస్థలే గర్భిణి స్త్రీలలో పనిచేయవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. 201113 మధ్యకాలంలో అమెరికా లోని 741 మంది గర్భిణులపై పరిశోధకులు అధ్యయనం చేశారు. వెలుతురు అంతగా లేని డిమ్‌లైట్‌లో నిద్రించే గర్భిణుల్లో గర్భస్థ డయాబెటిస్ చాలావరకు కనిపించలేదని రుజువైంది.