Tuesday, November 5, 2024

విషాద ఘటన.. కారులో మంటలు చెలరేగి గర్భిణి సజీవదహనం

- Advertisement -
- Advertisement -

కన్నూర్: తమకు పుట్టబోయే బిడ్డపై ఆ దంపతుల బోలెడు ఆశలు మాడిమసయ్యాయి.. వెళ్లుతున్న కారే వారికి చితిమంటలను పేర్చి, జన్మనెత్తనున్న మరో జీవిని కూడా బలి తీసుకుంది. కేరళలో జరిగిన ఓ విషాద ఘటనలో దంపతులు కారులో ఆహుతి అయ్యారు. రాష్ట్రంలోని కన్నూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోనే ఈ దుర్ఘటన జరిగింది. ఘటనలో కారు మంటల్లో దుర్మరణం చెందిన మహిళ గర్భవతి. పురుటి నొప్పులు రావడంతో ఆమెను కారులో ఆసుపత్రికి తీసుకువెళ్లుతుండగా మంటలు చెలరేగాయి.

ఈ ఘటనలో దంపతులు 26 ఏండ్ల రీషా, 35 ఏండ్ల ప్రిజిత్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వెనుక సీట్లో ఉన్న నలుగురు బయటకు సురక్షితంగా వచ్చారు. వీరిలో ఓ బాలుడు కూడా ఉన్నాడు. గాయపడ్డ వారిని వెంటనే ఆసుపత్రికి చికిత్సకు తరలించినట్లు నగర పోలీసు కమిషనర్ అజిత్ కుమార్ తెలిపారు. వీరికి గాయాలేమి కాలేదని, ఆసుపత్రిలో చెకప్‌ల కోసం తీసుకువెళ్లారని వివరించారు. మంటలు చెలరేగిన కారులో నుంచి దంపతులను బయటకు వచ్చేందుకు స్థానికులు, దారిన పొయ్యే వారు చాలా ప్రయత్నించారు.

అయితే ఈ 2020 మారుతీ ఎస్ ప్రెస్సో కారు ముందు డోర్లు మూసుకుపోయి ఉండటం, మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో దంపతులు సజీవ దహనం కావడం స్థానికులను కలిచివేసింది. తాము వీరిని రక్షించేందుకు ఎంతో కష్టపడ్డా నిస్సహాయ స్థితిలో ఉండాల్సి వచ్చిందని, మృతురాలు గర్భవతి అని తెలిసి తాము మరింత కుమిలిపోయినట్లు అక్కడి వారు చెప్పారు. దంపతులు జిల్లాలోని కుట్యాటూరుకు చెందిన వారు. భర్తకు 35, భార్యకు 26 ఏండ్లు ఉంటాయి. కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని, ముందు భాగంలో పెద్ద ఎత్తున మంటలు లేచాయని, ఆయిల్ ట్యాంక్ ఏ క్షణంలో అయినా పేలుతుందని అన్పించిందని ప్రత్యక్ష సాక్షి తెలిపారు.

కారు తగులబడిపోవడానికి కారణాలను సాంకేతిక నిపుణులు ఆరాతీస్తున్నారు. తగులబడ్డ కారును క్షుణ్ణంగా పరిశీలించి, శాస్త్ర, సాంకేతిక, ఆటోమొబైల్ నిపుణుల సాయంతో అన్ని విషయాలు నిర్థారించుకుని ఆ తరువాత ఈ ఘటనపై పూర్తి స్థాయి సమాచారం పొందుతామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News