సంగారెడ్డి : టెట్ పరీక్ష రాసేందుకు వెళ్లి పరీక్షా కేంద్రంలో గర్భిణి మృతి చెందిన ఘటన పటాన్ చెరు మండలంలో శుక్రవారం జరిగింది. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరన్న భయంతో రాధిక అనే అభ్యర్థి పరీక్షకు ముందుగానే చేరుకునే ప్రయత్నం చేసింది.
రాధిక, అరుణ్‌లు గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నారు. రాధిక 8 నెలల గర్భిణి. బైక్ పై ప్రయాణించి పటాన్చెరులోని ఇస్నాపూర్‌లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లోని పరీక్షా కేంద్రానికి చేరుకుంది. పరీక్ష ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో పరీక్షా కేంద్రం వద్ద వేగంగా పరుగెత్తింది. సెంటర్ కి రాగానే బీపీ పెరిగిపోయి చెమటలు పట్టాయి. పరీక్ష కేంద్రంలోనే కుప్పకూలింది.
రాధికను ఆమె భర్త అరుణ్ పటాన్ చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రాధిక మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. వీరికి ఇప్పటికే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ ఘటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.