Wednesday, January 22, 2025

గర్భస్రావ హక్కుపై కత్తి!

- Advertisement -
- Advertisement -

25 high courts had 58,94,060 cases pending దాదాపు అర్ధ శతాబ్ది తర్వాత గర్భస్రావ సమస్య అమెరికాను మళ్లీ కుదిపేస్తున్నది. ఇంత కాలంగా అమల్లో వున్న ఈ హక్కును రద్దు చేయడానికి ఉద్దేశించిన ముసాయిదా తీర్పు బయటకు పొక్కడం, అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా అది తాము సిద్ధం చేసుకున్నదేనని ధ్రువపరచడం జరిగిపోయాయి. దీనితో జనంలో గగ్గోలు మొదలైంది. మహిళకు తన దేహం మీద సంపూర్ణ హక్కు వుండాలని ఏ అభ్యుదయ సమాజమైనా హృదయపూర్వకంగా ఆశిస్తుంది. అందుకు దోహదపడుతుంది.అవరోధంగా వున్న శక్తుల నోరు మూయిస్తుంది. ప్రపంచం పురోగమించడానికి ఇదొక్కటే మార్గం.

మామూలుగా అయితే ఆరు వారాల లోపు గర్భాన్ని చట్టబద్ధంగా తొలగించుకునే అవకాశం అమెరికాలోనూ వుంది. ఆపైబడిన గర్భాల విషయంలోనే అంతకు ముందు వరకు కఠినమైన ఆంక్షలు వుండేవి. రో అనే వొంటరి గర్భవతి కేసులో 1973 నాటి సుప్రీంకోర్టు ఉత్తర్వుతో అమెరికా అంతటా గర్భస్రావం తిరుగులేని హక్కుగా స్థిరపడింది. అత్యున్నత న్యాయస్థానం గర్భస్రావ హక్కును రద్దు చేస్తే ఆ మేరకు కఠినమైన చట్టాలు చేయడానికి రిపబ్లికన్ల పాలనలోని రాష్ట్రాలు సిద్ధంగా వున్నాయి. సంప్రదాయవాదులు, మత ఛాందసులతో కూడిన రిపబ్లికన్ పార్టీ గర్భాన్ని తొలగించడానికి బద్ధ వ్యతిరేకి. డోనాల్డ్ ట్రంప్ సారథ్యంలో ఇటీవలి వరకు రిపబ్లికన్ పార్టీ అధికారంలో వున్నప్పుడు సుప్రీంకోర్టు సంప్రదాయవాదులైన న్యాయమూర్తుల ప్రాబల్యంలోకి వెళ్లిపోయింది.

తీర్పు ముసాయిదా బయటకు పొక్కడం పట్ల ఛాందసవాదులు తీవ్ర అసంతృప్తితో, ఆగ్రహంతో వున్నారు. దానిని ఎవరు బయటపెట్టారో ఇంత వరకు వెల్లడి కాలేదు. బయటపడడంపై కూలంకషమైన విచారణ జరిగే అవకాశముంది. ముసాయిదా తీర్పు సారాంశం వెల్లడి కావడంతో వాషింగ్టన్‌లోని సుప్రీంకోర్టు బయట రెండు వైపుల వారు ప్రదర్శనలు చేస్తున్నారు.‘మా శరీరాల మీద మీ పెత్తనం చెల్లదు, గర్భస్రావం ఆరోగ్య అవసరం’ అంటూ అనుకూలురు, పుట్టబోయే పిల్లలను చంపొద్దంటూ వ్యతిరేకులు ఎలుగెత్తుతున్నారు. భారత దేశంలో చట్టం గర్భస్రావానికి పూర్తి అనుకూలమైనది. గతంలో పిండం వయసు 20 వారాలు ముగిసే వరకు చట్టబద్ధమైన స్రావానికి అవకాశముండేది. 2011లో ఈ కాలాన్ని 24 వారాలకు పొడిగించారు. ఇండియాలో మాదిరిగానే బ్రిటన్‌లో 24వ వారం వరకు గర్భస్రావానికి చట్టబద్ధ అవకాశముంది. పిండం పరిస్థితిని బట్టి కాన్పుకి ముందు వరకు గర్భస్రావం చేయించుకునే హక్కును బ్రిటన్ చట్టం కల్పిస్తున్నది. శాస్త్ర విజ్ఞాన రంగంలో ఎంతో ముందడుగు వేసి ప్రపంచానికి మార్గదర్శకత్వం వహిస్తున్న అమెరికాలో మత ఛాందస వర్గాల పట్టు కూడా గట్టిగానే వుంది. అయితే అమెరికన్ ఓటర్లలో దాదాపు మూడింట రెండొంతుల మంది గర్భస్రావ హక్కుకు అనుకూలురని తెలుస్తున్నది.

వచ్చే నవంబర్‌లో జరుగనున్న అమెరికన్ పార్లమెంటు ఎన్నికల్లో వీరంతా గర్భస్రావ హక్కును సమర్థించే అభ్యర్థులకే ఓటు వేస్తారని రాయిటర్స్ వార్తా సంస్థ జరిపిన అభిప్రాయ సేకరణలో వెల్లడైంది. ఇది ప్రస్తుతం అమెరికాను పాలిస్తున్న డెమొక్రాటిక్ పార్టీకి అనుకూలమైన అంశం. అధ్యక్షుడు జో బైడెన్ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత గూడుకట్టుకున్న నేపథ్యంలో ఆ పార్టీ ఈ ఎన్నికల్లో తిరిగి పుంజుకోడానికి ఇదొక మంచి అవకాశమని భావిస్తున్నారు. 24 దేశాలు గర్భస్రావాన్ని పూర్తిగా నిషేధించాయి. ఇందులో యూరప్‌లోని మాల్టా, అండోరా వున్నాయి. అలాగే మధ్య అమెరికాలోని హొండూరాస్, ఎల్‌సాల్వడార్లలో కూడా గర్భస్రావానికి అనుమతి లేదు. ఆఫ్రికాలో సెనెగల్, ఈజిప్టులలో సైతం ఇదే పరిస్థితి. ఎల్‌సాల్వడార్‌లో 1998లో గర్భస్రావానికి వ్యతిరేకంగా కఠినమైన ఆంక్షలు విధించారు.

క్యాథలిక్ చర్చికి చెందిన ఛాందసుల ఆధిపత్యం వల్ల చాలా మంది మహిళలు కఠిన శిక్షలు అనుభవించారు. అత్యాచారం వల్ల ఏర్పడిన గర్భాన్ని తొలగించుకోడానికి, కడుపులోని పిండం బతికి బట్టకట్టే అవకాశాలు లేని పరిస్థితుల్లో గర్భస్రావానికి అవకాశం కల్పించాలంటూ సాల్వడార్ మహిళలు గత మార్చిలో పెద్ద ఎత్తున ప్రదర్శన జరిపారు. ఫ్రాన్స్, జర్మనీ సహా 72 దేశాల్లో గర్భం వివిధ స్థాయిల వరకు దానిని వదిలించుకునే అవకాశాలున్నాయి. ఐర్లాండ్‌లో 12వ వారం వరకు గర్భాన్ని తొలగించుకునే వీలుంది. ఇలా గర్భస్రావం విషయంలో మానవాళి అంతా ఒక్క త్రాటి మీద లేకపోడం గమనించవలసిన విషయం. మతం ఎంతగా మనిషిని వెనుకకు లాగుతోందో ఇది చాటుతున్నది. అయితే మనిషిలోని ఆరని దీపం వంటి శాస్త్రీయ చైతన్యం ఈ అవరోధాలన్నింటినీ దాటుకొని ప్రపంచమంతటా మహిళకు తన శరీరం మీద సంపూర్ణమైన అధికారాన్ని కట్టబెట్టే రోజును ఆవిష్కరిస్తుందని ఆశిద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News