అందాల భామ ప్రీతి జింతా తెలుగులో మహేష్ బాబు సరసన నాని, వెంకటేష్ సరసన ప్రేమతో రా లాంటి చిత్రాల్లో నటించి హీరోయిన్‌గా మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఆతర్వాత బాలీవుడ్‌లో దశాబ్దానికి పైగా సినిమాలు చేసి ఓ వెలుగు వెలిగింది. అయితే విదేశీ బోయ్ ఫ్రెండ్ జీన్ గూడెనఫ్ ని పెళ్లాడిన ప్రీతిజింతా సరోగసీలో కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రీతి ప్రస్తుతం లాస్ ఏంజెల్స్‌లో నివాసం ఉంటోంది. అక్కడ అడవి మంటల్లో చిక్కుకున్నానని, దీంతో తాను ఎంతో భయాందోళనలకు గురయ్యానని వెల్లడించింది. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తెలియజేసింది.
లాస్ ఏంజిల్స్‌లో కార్చిచ్చు మధ్య తాను, తన కుటుంబం చిక్కుకున్నామని, అదృష్టవశాత్తూ ఇప్పటి వరకు సురక్షితంగా ఉన్నామని అభిమానులకు తెలిపింది ఈ భామ. “లాస్ ఏంజిల్స్‌లో మా చుట్టూ ఉన్న పొరుగు ప్రాంతాలను మంటలు నాశనం చేయడంతో చాలా కుటుంబాలు ఖాళీ చేసి వెళ్లిపోయాయి. ఈ ప్రాంతమంతా హై అలర్ట్‌లో ఉంది. ప్రస్తుతం సురక్షితంగా ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నాను”అని ప్రీతి పేర్కొంది.