ముంబై: సోషల్‌మీడియా వాడకం పెరిగినప్పటి నుంచి సెలబ్రిటీలు అభిమానులకు ఎంతో చేరువ అయ్యారు. తరచూ సోషల్‌మీడియాలో సెలబ్రిటీలు యాక్టివ్‌గా ఉంటూ.. తమ సమాచారాన్ని అభిమానులకు చేరవేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా వాళ్లకి కొన్ని చేధు అనుభవాలు కూడా ఎదురవుతున్నాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఓ అభిమానికి క్షమాపణ చెప్పారు.
తాజాగా ప్రీతి ‘ఎక్స్’లో అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ అభిమాని ఆమెను ‘మీరు బిజెపిలో చేరుతున్నారా?’ అంటూ ప్రశ్నించాగా.. ఆమె కాస్త కఠినంగా సమాధానమిచ్చారు. ‘సోషల్‌మీడియాతో వచ్చే ఇబ్బంది ఇదే.. ప్రతి ఒక్కరు జడ్జ్ చేస్తారు. దేవాలయాలకు, కుంభమేళాకు వెళితే.. బిజెపిలో చేరుతానని అర్థం కాదు. విదేశాల్లో ఉన్నప్పుడు నాకు మన దేశం విలువ తెలిసింది. అందరికంటే ఎక్కువగా నేను భారత్‌ను, భారతీయ సంస్కృతిని గౌరవిస్తాను’ అంటూ జవాబిచ్చారు.
దీంతో ఆమెపై కొందరు నెటిజన్లు ఫైర్ అయ్యారు. అంత చిన్న ప్రశ్నకు అంత కఠినంగా జవాబు ఇవ్వాలా అని కామెంట్ పెట్టారు. దీంతో ప్రీతి జింటా క్షమాపణ చెప్పారు. తన సమాధానం కఠినంగా అనిపిస్తే.. క్షమించాలని ఆ ప్రశ్నకు తాను అసహనానికి గురైనట్లు ఆమె పేర్కొన్నారు. తన పిల్లాలు తాను విదేశాల్లో ఉంటే.. భారతీయతను మర్చిపోకూడదనే.. దేవాలయాలకు తీసుకువెళ్తున్నట్లు ఆమె తెలిపారు. దాన్ని రాజకీయం చేయవద్దని .. ఫ్యాన్స్ అంటే తనకు ఎప్పుడూ గౌరవమేనని ఆమె స్పష్టం చేశారు.