Monday, January 20, 2025

ప్రేమదేశం దర్శకుడి మొదటి సినిమా పాట్లు

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: ప్రేమదేశం, ప్రేమికుల రోజు లాంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన తమిళ దర్శకుడు కదిర్‌కి దర్శకుడిగా మొదటి చిత్రం హృదయం పేరుతో విడుదలైంది. డబ్బింగ్ చిత్రాలే అయినప్పటికీ స్ట్రెయిట్ చిత్రాలతో సమానంగా ప్రేమదేశం, ప్రేమికుల రోజు చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ఆ రెండు చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించింది ఎఆర్ రహ్మాన్. ఆ చిత్రాలలోని పాటలు 25 ఏళ్లు దాటినా ఇప్పటికీ సినీ ప్రేమికులను అలరిస్తూనే ఉన్నాయి. ముస్తఫా, ముస్తఫా పాట అయితే ఫ్రెండ్‌షిప్‌కు నిర్వచనంగా మారిపోయింది. అయితే కదిర్ దర్శకుడిగా మారడం వెనుక చాలా కథ ఉంది. వ్యథ కూడా ఉంది. ఆ వివరాలు ఆయనే స్వయంగా ఒక ఇంటర్వూలో చెప్పుకొచ్చారు.

1980వ దశకంలో ఫైన్ ఆర్ట్ కాలేజీలో చిత్రలేఖనం నేర్చుకోవడానికి కదిర్ తమిళనాడులోని ఒక గ్రామం నుంచి మద్రాసు చేరుకున్నారు. నిరుపేద కుటుంబం కావడంతో కాలేజీకి వెళుతూనే తనకు వచ్చిన డ్రాయింగ్స్‌తో డిజైనర్‌గా కూడా పనిచేయడం ప్రారంభించారు. పెళ్లి కార్డులకు, విజిటింగ్ కార్డులకు డిజైనర్‌గా ఆయన పనిచేస్తూ పాకెట్ మనీ సంపాదించుకునేవారు. అలా పని చేస్తున్న కాలంలో ఆయనకు కొందరు సినీ రంగానికి చెందిన డిజైనర్‌లతో పరిచయం ఏర్పడింది. కదిర్ వేసిన డ్రాయింగ్స్, ముత్యాల్లాంటి ఆయన చేతి రాత చూసి ముచ్చటపడిన ఒక మిత్రుడు అప్పటికే తమిళ చిత్రపరిశ్రమలో అగ్రదర్ధకుడిగా మారిన కె భాగ్యరాజా దగ్గరకు తీసుకెళ్లి పరిచయం చేశాడు.

కదిర్‌లోని ప్రతిభను గుర్తించిన భాగ్యరాజా తాను అప్పుడు దర్శకత్వం వహిస్తున్న అంద 7 నాట్కల్ (తెలుగులో త్రెలుగులో బాపు రాధాకల్యాణం పేరుతో తీశారు) చిత్రానికి టైటిల్ కార్డ్, పబ్లిసిటీ డిజైనింగ్ చేసే అవకాశాన్ని కదిర్‌కు కల్పించారు. ఆ చిత్రాన్ని నిర్మాత ప్రముఖ నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలింస్ నిర్మిస్తోంది. ఆ నిర్మాణ సంస్థ సారథి త్యాగరాజన్. ఆయనతో కదిర్‌కు పరిచయం ఏర్పడడమేగాక అది సాన్నిహత్యానికి దారితీసింది. వారి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా మార్చేసింది. భాగ్యరాజా దర్శకత్వం వహించిన చాలా చిత్రాలకు కదిర్ డిజైనర్‌గా పనిచేశారు. కదిర్ ఐదేళ్ల చదువు ముగింపు దశకు చేరుకుంటున్న దశలో దర్శకత్వ శాఖలో చేరాలన్న ఆలోచన ఆయనకు కలిగింది. తాను బాగా అభిమానించే దర్శకుడు భాగ్యరాజా వద్దే అసిస్టెంట్‌గా చేరాలని నిర్ణయించుకుని అదే విషయాన్ని ఆయనకు కదిర్ చెప్పారు.

అయితే.. అందుకు భాగ్యరాజా ఒప్పుకోలేదు. చేతిలో అంత అద్భుతమైన ఆర్ట్ ఉంచుకుని సహాయదర్శకుడిగా చేరడం ఏమిటని ఆయన మందలించారు. ఈ డిజైనింగ్ వృత్తిలోనే కొనసాగాలని సలహా ఇవ్వడంతో కదిర్ నిరాశ చెందారు. అప్పటికే పీక్‌లో ఉన్న భారతీరాజా దగ్గర అసిస్టెంట్‌గా చేరితే మంచిదని భావించి ఆయన ఒక హోటల్ దగ్గర ఉన్నారని తెలిసి కదిర్ అక్కడకు వెళ్లిపోయి హోటల్ బయట ఆయన కోసం ఎదురుచూడసాగారు. ఒరు ఖైదీ ఇన్ డైరీ సినిమా కథాచర్చలు హోటల్ లోపల నడుస్తున్నాయి. ( కలహాసన్, రేవతి నటించిన ఈ చిత్రం తెలుగులో ఖైదీ వేట పేరిట డబ్ కాగా హిందీ ఆఖ్రీ రాస్తా పేరుతో అమితాబ్ బచ్చన్ హీరోగా విడుదలైంది.

హటల్ బయటకు వచ్చిన దర్శకుడు భారతీరాజా నేరుగా తన కారులో కూర్చుని సిగరెట్ తాగుతుండగా కదిర్ ఆయన దగ్గరకు వెళ్లి విష్ చేశారు. అంతకుముందు ఇద్దరికీ ముఖ పరిచయం ఉండడంతో ఏమిటి విషయమని కదిర్‌ని ఆయన అడిగారు. తాను వచ్చిన విషయం కదిర్ చెప్పాలనుకుంటుండగా అక్కడకు భాగ్యరాజా కూడా వచ్చారు. ఈ చిత్రానికి భాగ్యరాజా కథ అందిస్తున్న విషయం కదిర్‌కు తెలియదు. కదిర్‌ను చూసిన మరుక్షణం ఆయన కూడా ఏమిటి ఇక్కడ అని ప్రశ్నించారు.

కదిర్ సహాయ దర్శకుడిగా చేరాలనుకుంటున్న విషయాన్ని భారతీరాజాకు భాగ్యరాజా చెప్పారు. ఇద్దరూ కలసి అక్షింతలు వేయడంతో కదిర్ మారుమాట మాట్లాడకుండా తన గదికి వచ్చి ఏడ్చేశారు. పెద్ద దర్శకుల దగ్గరకు వెళ్లకుండా చిన్నదర్శకుల దగ్గరకు వెళ్లడం మేలనుకుని తనకు కొద్దిగా పరిచయం ఉన్న భాగ్యరాజా శిష్యుడు పాండ్యరాజా దగ్గరకు వెళ్లాడు.
కన్నెరాసి అనే చిత్రానికి మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న పాండ్యరాజా దగ్గరకు అప్పటికే అసిస్టెంట్స్‌గా జిఎం కుమార్, లివింగ్‌స్టన్ ఉన్నారు. వాళ్లిద్దరితో కదిర్‌కు అంతకుముందే భాగ్యరాజా దగ్గర పరిచయం ఉంది. ఆ చనువు కొద్దీ పాండ్యరాజా దగ్గర అసిస్టెంట్‌గా కదిర్ చేరిపోయారు.

అలా కొన్ని చిత్రాలకు అసిస్టెంట్‌గా పనిచేసిన తర్వాత కదిర్‌కు సొంతంగా తానే దర్శకుడిగా ఎదగాలన్న కోరిక మొదలైంది. అప్పుడే ఇదియం(తెలుగులో హృదయం) కథ రెడీ చేసుకున్నారు. తనను బాగా ఆదరించే నిర్మాత త్యాగరాజన్(సత్యజ్యోతి ఫిలింస్)కే కథ చెప్పాలని నిర్ణయించుకున్నారు. అయితే చాలా జిజీగా ఉండే త్యాగరాజన్‌కు కథ చెప్పడానికే కదిర్‌కు ఏడాది పట్టింది. మొదటి సిట్టింగ్‌లోనే కథ ఓకే అయిపోయింది. ఇక ఇక్కడి నుంచి హీరో కోసం వేట మొదలైంది. ఆ టైంలో సక్సెస్ చిత్రాలలో దూసుకెళుతున్న రాంకీ, కార్తీక్, మోహన్‌లకు ఈ కథ వినిపించారు కదిర్. ముగ్గురికీ నచ్చలేదు. ఇందులో నటించమని మొహం మీదే చెప్పేశారు ఆ ముగ్గురూ. దీంతో కదిర్‌తోపాటు నిర్మాత కూడా డీలాపడిపోయారు. ఇతర చిత్రాల నిర్మాణంలో బిజీగా ఉన్న త్యాగరాజన్ ఈ విషయాన్ని పక్కనపెట్టేశారు. అలా మరో రెండేళ్లు గడిచిపోయింది. కదిర్‌కు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. తనకు తెలిసిన డిజైనింగ్ వర్క్‌ను పక్కనపెట్టేయడం వల్ల డబ్బుకు కటకట ఏర్పడింది. ఆ పనైనా మళ్లీ మొదలెడదామని నిర్మాత త్యాగరాజన్ ఇంటికి వెళ్లారు కదిర్.

కదిర్‌ను చూసిన మరుక్షణం త్యాగరాజన్ నోటి నుంచి వచ్చిన మొదటి మాట నీ కథకు హీరో మురళి అయితే ఎలా ఉంటాడు అని. తాను అడగాల్సిన విషయాన్ని నోట్లోనే ఆపేసుకున్న కదిర్ ఎంటనే ఓకే అనేశారు. అప్పటికప్పుడే త్యాగరాజన్ మురళికి ఫోన్ చేసి కదిర్ అనే కుర్రాడు వస్తున్నాడు.. అతని దగ్గర కథ విను.. అని చెప్పి ఫోన్ పెట్టేశారు. తన సొంత కారు ఇచ్చి కదిర్‌ను మురళి దగ్గరకు త్యాగరాజన్ పంపించారు. కదిర్ చెప్పిన కథ మురళికి నచ్చడంతో కదిర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. హీరో సమస్య తీరింది..కాని ఈ చిత్రంలో అత్యంత కీలకమైన హీరోయిన్ ఎవరన్న ప్రశ్న మొదలైంది కదిర్‌కు. హీరోయిన్‌గా కొత్త అమ్మాయిని పరిచయం చేయాలన్నది కదిర్ ఆలోచన. తనకు పరిచయం ఉన్న యాడ్ ఫిల్మ్ మేకర్లను సంప్రదించాడు. అందులో ఖాదీ క్రాఫ్ట్‌లో నచించిన ఒక మోడల్ కదిర్‌కు నచ్చింది. ఆ అమ్మాయి బొంబాయిలో ఉంటుందని తెలిసి ఆమె అడ్రస్ సంపాదించి అక్కడే ఉన్న తన యాడ్ మేకర్లయిన భార్యాభర్తలిద్దరినీ తన వెంట పెట్టుకుని ఆ మోడల్ ఇంటికి వెళ్లారు.

తాము ఒక యాడ్ ఫిల్మ్ చేయడానికి వచ్చామని చెప్పి ఆమెతో పరిచయం చేసుకున్నారు. మాటల సందర్భంలో తనకు సినిమాల్లో నటించడం పట్ల ఆసక్తి లేదని ఆ మోడల్ తెగేసి చెప్పేసింది. బయటకు వచ్చిని తర్వాత తన సినిమాలో హీరోయిన్‌గా ఆమే నటించాలని కదిర్ నిర్ణయానికి వచ్చేశారు. ఆమెకు నచ్చచెప్పే బాధ్యతను తన మిత్రులకు అప్పచెప్పారు. ఆ భార్యభర్తలిద్దరూ ఆ మోడల్‌తో స్నేహం పెంచుకున్నారు. మాటల సందర్భంలో ఒక అద్భుతమైన కథ ఉందని, నటించినా,నటించకపోయినా ఆ కథ వినమని ఆమెకు నచ్చచెప్పారు. కథ వినడానికి ఆమె ఒప్పుకుంది. ఆమె ఇంటికి వెళ్లిన కదిర్ ఆమెతోపాటు ఆమె తల్లి, అక్క, ఇతర కుటుంబ సభ్యులు అందరూ కూర్చుండగా కథ చెప్పారు.

తాను తీయబోయే చిత్రంలో హీరో, హీరోయిన్ మధ్య డ్యూయట్లు ఉండవని, కనీసం వారిద్దరూ ఒకరినొకరు తాకను కూడా తగరని, హీరోయిన్ డాక్టర్ చదువుకుంటోందని, ఆమె చాలా హుందాగా ఉంటుందని చెప్పడంతో ఆ మోడల్ తల్లికి, అక్కకు కథ నచ్చింది. కుమార్తెకు నచ్చచెప్పే బాధ్యత వారే తీసుకుని ఒప్పించారు. అలా హృదయం చిత్రంలో హీరోయిన్‌గా హీరా రాజగోపాల్ వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత కాలంలో ఆమె చాలా చిత్రాలలో హీరోయిన్‌గా నటించారు. 1991 సెప్టెంబర్ 6న తమిళంలో విడుదలైన ఇదయం చిత్రం అఖండ విజయం సాధించింది. ఇళరాజా స్వరపరిచిన ఐదు పాటలు జననీరాజనాలు అందుకున్నాయి. అభిరుచిగల దర్శకుడిగా కదిర్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది ఇదయం చిత్రం. ఆ తర్వాత వరుసగా ఆయన దర్శకత్వం వహించిన ప్రేమదేశం, ప్రేమికుల రోజు విజయాలు అందుకుని యూత్ చిత్రాల దర్శకుడిగా కదిర్‌ను మార్చేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News