Monday, December 23, 2024

సూర్యాపేటను ముంచెత్తిన అకాల వర్షం

- Advertisement -
- Advertisement -

Premature rain in Telangana state

శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉ. వరకు కురిసిన వాన
రోడ్లు కాల్వలయ్యాయి, కాలనీలు చెరువులయ్యాయి
పలుచోట్ల పొంగిపొర్లుతున్న వాగులు, చెరువులు
తాటికల్ వాగులో చిక్కుకున్న 8మందిని రక్షించిన స్థానికులు
పలుచోట్ల రాకపోకలకు అంతరాయం

మన తెలంగాణ/నల్లగొండ : ఊహించనివిధంగా వాన దంచి కొట్టింది.. పదేళ్ళ తర్వాత ఈ స్థాయిలో వర్షాలు కురవడంతో వాగులు, వంకలు ఏరులై పారాయి. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఉమ్మడి జిల్లాలో వరుణుడు తన తీవ్ర ప్రభావాన్నే చూపాడు. జనం నిద్రమత్తులో ఉండగా ఒక్కసారిగా వచ్చిన వర్షం ఉమ్మడి జిల్లా ప్రాంతంలో చాలా ప్రాంతాలను ముంచేసింది… దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆరు గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో చెరువులు, కుంటలు పొంగి పొర్లాయి. పెద్ద వాగులు జల ప్రవాహంతో కొత్త పుంతలు తొక్కొంది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలకు గురయ్యారు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలలో కురిసిన వర్షం.. నకిరేకల్ నుంచి నల్లగొండ వెళ్లే రహదారిలో ఉన్న తాటికల్ వాగు పొంగిపొర్లింది. దీంతో రాకపోకలు బంద్ అయ్యాయి. వాగు దాటలేక 8 మంది వలస కూలీలు చిక్కుకోవడంతో వారిని స్థానికులు గమనించి వారిని ఒడ్డుకు చేర్చారు. సూర్యాపేట నుంచి మిర్యాలగూడ వెళ్లేదారిలో ఉన్న నల్లచెరువు వాగు పొంగి పొర్లడంతో రాకపోకలు బంద్ అయ్యాయి.

మిర్యాలగూడ నుంచి వచ్చే ప్రజలు కొప్పోలు నుంచి తిరిగొచ్చారు. సూర్యాపేట నియోజకవర్గంలో వర్షం ప్రభావం ఎక్కువగా కన్పించింది. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువుల శివారు ప్రాంతంలో ఇల్లు నీట మునిగాయి. పట్టణంలోని మానసనగర్, ఇందిరనగర్, ఇందిరమ్మ కాలనీ, బివి కాలనీ, జాకీర్ హుస్సూన్ నగర్, శ్రీరాంనగర్ కాలనీ ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీగా వర్షం కురవడం, కాలనీలు నీట మునగడంతో స్థానిక ప్రజాప్రతినిధులు విషయాన్ని మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన లోతట్టు ప్రాంతాలలోని జనానికి రక్షణ కల్పించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి మున్సిపల్ అధికారులను, జాయింట్ కలెక్టర్ మోహన్‌రావుతో పాటు రెవెన్యూ, రెస్కూ టీంలతో సహాయక చర్యలు చేపట్టారు.

60 ఫీట్ల రోడ్డు నాలాలో పెద్ద ఎత్తున చెత్తచెదారం కారణంగా ఇబ్బందులు ఎదురవ్వడంతో జెసిబితో చెత్తా చెదరాన్ని తొలగించారు. ఇందిరమ్మ కాలనీ, మాసనసగర్‌లో నీళ్లు ఇళ్లలోకి రావడంతో మున్సిపల్ సిబ్బంది ఆ నీటిని తొలగించారు. ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల వద్ద రాయినిగూడెం, పిల్లలమర్రి కేతినేని చెరువుల నుంచి వచ్చిన వరద పొంగిపొర్లడంతో కళాశాల వద్ద రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎన్‌టిఆర్ పార్కు వరకు నీళ్లు రావడంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు.
పదేళ్ల తర్వాత ఒక్కసారిగా ఇంతటిస్థాయిలో వర్షం రావడంతో సద్దల చెరువు పొంగి, అలుగుల నుంచి భారీగా వరద రావడంతో ఎస్వీ డిగ్రీ కళాశాలలోకి నీళ్లు చేరాయి. జనవరి మొదట్లోనే ఒక్కసారిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసాయని చెప్పొచ్చు. సూర్యాపేటలో 14.5 సె.మీ. నకిరేకల్‌లో 11.7 సె.మీ వర్షం కురవగా, అయిటిపాలములలో 11.5 సె.మీ, కట్టంగూరల్‌లో 11.1 సె.మీ వర్షం కురిసింది.

తెరుచుకున్న మూసీ గేట్లు..

మూసీ ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల భారీగా నీరు వచ్చి చేరడంతో మూసి ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తి, దిగువ మూసీకి నీటిని వదులుతున్నారు. ప్రాజెక్ట్ దిగువ ప్రాంతంలోని కెటి అన్నారం, కాసరబాద, కుప్పిరెడ్డిగూడెం, ఎండ్లపల్లి, అన్నారం, నారాయణగూడెం ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News