Wednesday, January 22, 2025

గ్రూప్‌_1 పరీక్షకు పకడ్బందీగా ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: జిల్లాలో ఆదివారం గ్రూప్‌_1 పరీక్ష నిర్వహించేందుకు పకడ్భందీగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ కె. శశాంక తెలిపారు. జిల్లాలో 13 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా జిల్లాలో మొత్తం 4,046 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు కలెక్టర్ వివరించారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టినట్లు పేర్కోన్నారు. ఉదయం 10.30 గంట నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష సమయం ఉంటుందని తెలిపారు. పరీక్ష రాసే అభ్యర్థులు ఉదయం 8.30 గంటల నుంచి తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఉదయం 10.15 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రాల్లోనికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆర్టీసీ అధికారులు పరీక్ష రాసే అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా బస్సులు నడిపించాలని ఆదేశించినట్లు వివరించారు.

పరీక్షా నిర్వహించే సమయంలో ఆయా పరీక్షా కేంద్రాలకు సమీపంలోని జీరాక్స్ కేంద్రాలను మూసి వేయించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. పరీక్షలు రాసే అభ్యర్థులు బూట్లు వేసుకుని రాకూడదని, చెప్పులతోనే పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే ఆధునిక సాంకేతిక వస్తువులు ఏవీ పరీక్షా కేంద్రాలలోనికి అనుమతించబోమని, సెల్‌ఫోన్లకు కూడా అనుమతించేది లేదన్నారు. పరీక్షా కేంద్రాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని వాష్ రూములను కూడా తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

సీసీ కెమెరాలు చీఫ్ సూపరెండెంట్ రూమ్‌లోనూ, పరీక్షా కేంద్రం ముందు ఏర్పాటు చేయించామని వివరించారు. ఈ మేరకు అన్ని పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, వైద్య శిభిరాల ఏర్పాటుతో పాటు నిరంతరం విద్యుత్ సరఫరా తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. పరీక్షా సమయం ముగిసే వరకు అభ్యర్థులెవరిని భయటకు రానివ్వరని కలెక్టర్ స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంతో పాటు మరిపెడ, తొర్రూరు కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
పటిష్టమైన పోలీసు బందోబస్తు: డీఎస్పీ రమణబాబు
ఆదివారం నిర్వహించే గ్రూప్‌_1 పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తు చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ రమణబాబు తెలిపారు. ఈ మేరకు పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల మేర 144 సెక్షన్ అమలులో ఉంటుందని డీఎస్పీ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News