ఇవిఎంలు, ఓటర్ల జాబితాల కసరత్తు
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు చేపట్టారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత , రాష్ట్రం విభజితం అయిన తరువాత తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికైతే ఎటువంటి నిర్ణీతమైన తేదీలతో ప్రకటనలు వెలువరించలేదు. ఈలోగా ఎన్నికల నిర్వహణకు అవసరం అయిన అన్ని ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఇవిఎం) నిశిత పరిశీలన చేపట్టారు. ఎఫ్‌ఎల్‌సి, వివిప్యాట్‌ల తనిఖీలు ఈనెలాఖరులో శ్రీనగర్‌లోని ఓ వర్క్‌షాప్‌లో చేపడుతారని అధికారులు ఆదివారం తెలిపారు. పోలింగ్‌కు ఇవిఎంల వాడకం చేపడుతూ ఉండటంతో వీటి నిర్వహణ పారదర్శకం, సమగ్రంగా ఉండేందుకు చర్యలు చేపట్టారు. తనిఖీల ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఓ బృందం వస్తుంది. వర్క్‌షాప్‌లో జరిగే ప్రక్రియకు లోయలోని పదిజిల్లాల డిప్యూటీ కమిషనర్లు హాజరవుతారు. ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ఎప్పుడైనా ప్రకటించవచ్చు.
నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధం అవుతోందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. రాష్ట్రంలో పిడిపి బిజెపి సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడంతో అప్పటి గవర్నర్ సత్యపాల్ మాలిక్ అసెంబ్లీని రద్దు చేయడంతో 2018 నవంబర్ నుంచి జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఉనికిలో లేదు. జమ్మూ కశ్మీర్‌లో అత్యంత కీలకమైన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఈ ఏడాది ఆరంభంలోనే పూర్తయింది. తాజా ఓటర్ల జాబితాలను రూపొందించే పని చురుగ్గా సాగుతోంది. అక్టోబర్ 31 నాటికి ఓటర్ల జాబితాలను వెలువరించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం తుది గడువును ఖరారు చేసింది. పోలింగ్ కేంద్రాలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై కూడా సన్నాహాలు చేపట్టారు. ఈ సంవత్సరం చివరిలోనే జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, ఇందుకు అనువైన వాతావరణ నెలకొని ఉందని గత నెలలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఇక ఈ నెల ఆరంభంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఎన్నికల గురించి ప్రస్తావించారు. ఓటర్ల జాబితా సవరణలు పూర్తి తరువాత ఎన్నికలు జరిగితీరుతాయని తెలిపారు.