Sunday, December 22, 2024

అత్యధిక పంటలు పండించే విధంగా తెలంగాణ ఏర్పడింది: మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

Preparatory meeting for cultivation in Siddipet

సిద్దిపేట: వ్యవసాయ రంగంలో సిద్దిపేట జిల్లా ఆదర్శంగా ఉండేలా వైవిధ్యభరితమైన పంటలను పండించాలని రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడిటోరియంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట, మెదక్ రెండు జిల్లాల వానాకాలం 2022 సాగుకు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర వ్యవసాయశాఖ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో కలిసి మంత్రి హరీష్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ….. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ రైతులు పంట పండించడానికి సాగునీరు లేక పంటలు వేయడానికి ప్రభుత్వం సహకారం అందించక, కష్టపడి పంటలు పండించే వాటికి సరైన గిట్టుబాటు లేకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకునే వారని కాని తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, కాలేశ్వరం తదితర ప్రాజెక్ట్ లతో సాగునీరు, ఎకరానికి 10వేల రూపాయల సాయం అందించే రైతుబందు, సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడంతో ఊహకందని విధంగా ధాన్యం దిగుబడి సాధించి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో వరిధాన్యాన్ని తూకం వేయడానికి కాంటాలు సరిపోకపోవడం, బస్తాల్లో నింపడానికి, రైస్ మిల్లులలో దింపడానికి హమాలీలు సరిపోకపోవడం, దాన్యాన్ని నిలువ చేయడానికి గోడౌన్లు సరిపోని అంత గొప్ప స్థాయికి రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి సాధించిందని అన్నారు. ఒకప్పుడు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఈ ప్రాంతం రైతులు వలస వెళ్ళగా ప్రస్తుతం రాష్ట్రంలోని వ్యవసాయ రంగంలో ఉపాధి కోసం పశ్చిమ బెంగాల్, బీహార్ తదితర రాష్ట్రాల నుండి కూలీలు వస్తున్నారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సర్కారీ నౌకరికి ఉన్నంత క్రేజీ వ్యవసాయ దారులకు ఉందని, సాఫ్ట్ వేర్ తో సమానంగా కొంతమంది రైతులు ఆదాయాన్ని వ్యవసాయంతో అర్జీస్తున్నారని అన్నారు.

మండుటెండల్లో కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలోని వాగులు కాలేశ్వరం ప్రాజెక్టు నీటితో కళకళలాడుతున్నాయని, చెరువు మత్తడి పోస్తున్నాయని అన్నారు. సిద్దిపేట జిల్లాలో 7272 మంది రైతు కుటుంబాలకు రైతు బీమా అందించామని అన్నారు. సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో వ్యవసాయ రంగానికి దిశానిర్దేశం చేసేది రైతు బంధు సమితి సభ్యులేనని రాష్ట్ర బడ్జెట్లో వెయ్యి కోట్ల రూపాయలు ఆయిల్ ఫామ్ పంటలకు సబ్సిడీకి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని దానిని అందిపుచ్చుకొని ఆయిల్ ఫామ్ పండించేందుకు రైతులను ప్రోత్సహించాలని అన్నారు. ఈ సంవత్సరం సిద్దిపేట జిల్లాలో 30 వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటేందుకు లక్ష్యాన్ని సాధించడం జరిగిందని లక్ష్యాన్ని సాధించే దిశగా రైతు వేదికల ద్వారా రైతులను చైతన్య పరచాలని అన్నారు. ఏఈవోలు రైతుల వద్దకు వెళ్లి ఆయిల్ ఫామ్ లాభాలను వివరించాలని అన్నారు. వచ్చే సంవత్సరం మెదక్ జిల్లాలో ఆల్బమ్ ఫాం మొక్కలను అందిస్తామని తెలిపారు. సెరి కల్చర్ ఫామ్ ను పెంచడానికి 3 లక్షల రూపాయల సబ్సిడీ ఉందని రైతులను సెరికల్చర్ మరియు తక్కువ వ్యయంతో అధిక లాభాలు గడించే వరి విత్తనాలను వెదజల్లే సాగును ప్రోత్సహించాలని ప్రతి ఏఈఓ పరిధిలో 10 శాతం వరి పంటలో కచ్చితంగా వెదసాగు జరిగేలా చూడాలని అన్నారు.

విత్తన పంటల సాగుతో అధిక ఆదాయం పొందవచ్చు, మొక్కజొన్న సీడ్స్ కంపెనీలు ఈ పరిసరాల్లో ఉన్నందున మెదక్,సిద్దిపేట జిల్లాల్లో 25 వేల చొప్పున విత్తన పంటలను పండించాలని అన్నారు. పచ్చిరొట్ట ఎరువులతో పంటల దిగుబడి అధికంగా వస్తుంది కాబట్టి పచ్చిరొట్ట సాగును ప్రోత్సహించాలని అన్నారు. రసాయనిక ఎరువుల వాడకం తగ్గించడం మూలంగా ఆరోగ్యవంతమైన ఆహారం ప్రజలకు అందించగలుగుతామని అన్నారు. ములుగు హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్లో పెంచిన మిరపనారుతో ఎకరానికి 4 లక్షల రూపాయల విలువైన మిర్చి దిగుబడిని సాధించారని ఈ సంవత్సరం మిర్చి, టమాటా ఇతర కూరగాయల మొక్కలను అత్యధికంగా పెంచి రైతులకు అందించాలని వ్యవసాయశాఖ మంత్రిని కోరారు. మెదక్, గజ్వేల్, కొడకండ్ల వరకు రైల్వే లైన్ విస్తరించినందున ఎరువుల పాయింట్లను ఏర్పాటు చేయాలని అన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి చెర్నకోలు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ముందస్తు ప్రణాళికతో రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అందించిన ఊతం మూలంగా దేశానికి అన్నం పెట్టే స్థాయికి రాష్ట్రం ఎదిగిందని అన్నారు. 60 శాతం జనాభా ఆధారపడి ఉన్నా వ్యవసాయ రంగం అభివృద్ధి సాధిస్తే మిగతా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమేనని అన్నారు. అత్యధిక మందికి ఉపాధి ఇచ్చే వ్యవసాయరంగం సుస్థిరం కోసం పాఠ్యాంశాలను రూపొందిస్తున్నామని, రైతు వేదికలలో సంవత్సరం పొడవునా రైతులకు లాభసాటి వ్యవసాయం పై శిక్షణ తర్వాత నిర్వహిస్తామని వీటిలో రైతులతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొనాలని అన్నారు. ఆయిల్ ఫామ్ కు ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా ఆ దిశగా రైతులను ప్రోత్సహిస్తూ ఉన్నామని దానిలో భాగంగా సిద్ధిపేట నియోజకవర్గంలో 300 కోట్ల రూపాయలతో ఆయిల్ఫామ్ నిర్మాణ పనులను చేపట్టడం జరిగిందని అన్నారు. రైతులను సమీకృత వ్యవసాయంలో ప్రోత్సహించాలని సూచించారు.

రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ రంగం ప్రోత్సహించడంలో భాగంగా 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల ఉచిత విద్యుత్ ను అందిస్తున్నామని, ఏడు విడతల్లో రైతుబంధు పథకం ద్వారా 50 వేల ఐదు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని, 2604 మంది వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించడం జరిగిందని, పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని అన్నారు. రైతుబంధు సమితి సభ్యులకు గ్రామ, మండల స్థాయి వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించాలని అధికారులకు సూచించారు.
అంతకు ముందు వ్యవసాయశాఖ స్పెషల్ సెక్రటరీ హనుమత్ కే జెండాగే సిద్దిపేట మరియు మెదక్ జిల్లాలో వ్యవసాయశాఖ ద్వారా చేపట్టిన కార్యక్రమాల వివరాలను వివరించారు.

ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, జనగామ ఎంఎల్ఏ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ, సిద్దిపేట, మెదక్ కలెక్టర్లు ఎం. హనుమంతరావు, హరీష్ ఎమ్మెల్సీలు డాక్టర్ యాదవరెడ్డి, శేరి సుభాష్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాపరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ లు రోజా రాధాకృష్ణశర్మ. హేమలతా శేఖర్ గౌడ్, డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి,. డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ మెదక్, సిద్దిపేట జిల్లాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, పిఎసిఎస్ చైర్మన్లు రైతు బంధు సమితి జిల్లా, మండల, గ్రామ కోఆర్డినేటర్లు, ఆత్మ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News