సుప్రీం కోర్టుకు అఫిడవిట్‌లో తెలిపిన ఆప్ ప్రభుత్వం
న్యూఢిల్లీ : ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి అవసరమైతే సంపూర్ణ లాక్‌డౌన్ విధించడానికి తాము సిద్ధమేనని కేజ్రీవాల్ నేతృత్వం లోని ఆప్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సోమవారం వెల్లడించింది. ఢిల్లీలో వాయు కాలుష్యంపై శనివారం సుప్రీం కోర్టు ఆగ్రహించిన సంగతి తెలిసిందే ఢిల్లీలో వాయు కాలుష్యంపై సోమవారం సుప్రీం కోర్టులో అత్యవసర విచారణ జరిగింది. పర్యావరణ ఉద్యమనేత ఆదిత్య దూబే, న్యాయ శాస్త్ర విద్యార్థి అమన్ బంకా దాఖలు చేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పంట వ్యర్ధాలను తొలగించే యంత్రాలను చిన్న, మధ్య తరహా రైతులకు ఉచితంగా ప్రభుత్వం అందించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ దారులు తమ పిటిషన్‌లో కోరారు. దీనిపై కేజ్రీవాల్ ప్రభుత్వం న్యాయస్థానానికి ప్రమాణ పత్రం సమర్పించింది. ఢిల్లీతోపాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సిఆర్ ) పరిధి లోకి వచ్చే ప్రాంతాల్లోనూ వాయు కాలుష్యాన్ని నియంత్రించే కఠిన నిబంధనలు అమలు చేయాల్సి ఉందని ప్రమాణ పత్రంలో పేర్కొంది. లాక్‌డౌన్ మాత్రమే తక్షణం కొంతమేరకు ప్రభావం చూపించ గలదని తెలియచేసింది.
స్థానిక ఉద్గారాలను అదుపు చేసేందుకు సంపూర్ణ లాక్‌డౌన్ వంటి నిర్ణయాలు తీసుకోడానికి ఢిల్లీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీంతోపాటు పక్క రాష్ట్రాల పరిధి లోని ఎన్‌సిఆర్ ప్రాంతంలో కూడా ఇలాంటి చర్యలే తీసుకొంటే ఫలితం మెరుగ్గా ఉంటుందని పేర్కొంది. ఈమేరకు ఎన్‌సిఆర్ రీజియన్‌లో అమలు చేయాలని కేంద్రం గానీ, కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ గానీ ఆదేశించాలని ప్రమాణ పత్రంలో పేర్కొంది. అన్ని స్కూళ్లు, కాలేజీలు, విద్యాబోధన, కోచింగ్ సంస్థల్లో , నైపుణ్యాభివృద్ధి , శిక్షణ సంస్థల్లో ఇతర శిక్షణ సంస్థల్లోను, లైబ్రరీల్లోను వాయు నాణ్యత క్షీణించడాన్ని దృష్టిలో పెట్టుకుని ఈనెల 20 వరకు ఈ సంస్థలను మూసివేశామని ప్రభుత్వం వివరించింది. అన్ని ప్రైవేట్ కార్యాయాలు,సంస్థల ఉద్యోగులు ఇంటి దగ్గర నుంచే పని చేసేలా చూడాలని సూచించామని, దీనివల్ల రోడ్లపై వాహనాల రాకపోకలు ఈనెల 17 వరకు కనీసం స్థాయికి తగ్గుతాయని పేర్కొంది.
సుప్రీం కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా కాలుష్య నియంత్రణ టవర్ (స్మాగ్ టవర్) ను బాబా ఖరక్‌సింగ్ మార్గ్,కన్నాట్ ప్లేస్ ప్రాంతాల్లో ఆగస్టు 23 న ప్రారంభించడమైందని ఆప్ ప్రభుత్వం ధర్మాసనానికి తెలియచేసింది. కాలుష్య సాంద్రత పి.ఎం 2.5, పి.ఎం 10 ఆధారంగా ఢిల్లీలో 13 ప్రాంతాలను గుర్తించామని, కాలుష్య నియంత్రణకు తగిన చర్యలు తీసుకొంటున్నామని వివరించింది. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ గుర్తించిన 1636 పరిశ్రమల్లో కాలుష్యాన్ని తగ్గించడానికి పైపుల ద్వారా సహజ వాయువు ( పిఎన్‌జి ) ప్రక్రియను అమలు చేయించిందని వెల్లడించింది. ఎలెక్రిక్ బస్సులు, ఎలెక్ట్రిక్ రిక్షాలను కూడా ప్రవేశపెడుతున్నామని చెప్పింది.