ప్రధాని మోడీకి కేజ్రీవాల్ సూచన
న్యూఢిల్లీ: దేశంలోని 14,500 ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించాలన్న ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాన్ని సముద్రంలో నీటి బొట్టుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభివర్ణించారు. దీనికి బదులుగా దేశంలోని 10 లక్షల ప్రభుత్వ పాఠశాలలను వచ్చే ఐదేళ్లలో అభివృద్ధి చేయడానికి అన్ని రాష్ట్రాలతో సంప్రదించి ఒక ప్రణాళికను రూపొందించాలని ఆయన ప్రధాని మోడీకి సూచించారు. మంగళవారం ఆన్‌లైన్ ద్వారా విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని చెప్పిన ప్రకారమైతే దేశంలోని 10.5 లక్షల ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరచడానికి 70-80 ఏళ్లు పడుతుందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ప్రతి చిన్నారికి నాణ్యమైన, ఉచిత విద్యను అందచేయనంతవరకు ప్రపంచంలో మన దేశం అగ్రస్థానం పొందలేదని ఆయన అన్నారు.
భారత్ స్వాతంత్య్రం పొందిన తర్వాత ఒక పెద్ద పొరపాటు జరిగిందని, దేశంలోని ప్రతి గ్రామంలో మంచి నాణ్యమైన విద్య అందేలా పాఠశాలలు ఏర్పాటు చేసి ఉండవలసిందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ విద్యావంతులైనట్లయితే భారత్ పేద దేశం అయి ఉండేది కాదని ఆయనఅభిప్రాయపడ్డారు. హర్యానాలోని తన స్వస్థలం హిసర్ పట్టణం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ చేపట్టనున్న మేక్ ఇండియా నంబర్ 1 ప్రచారాన్ని బుధవారం ప్రారంభిస్తున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. ఈ ఉద్యమంలో ప్రజలందరినీ భాగస్వాముల్ని చేయడానికి ఇతర రాష్ట్రాలలో కూడా తర్వాత చేపడతామని ఆయన చెప్పారు. ఈ ప్రచారంలో చేరదలచిన వారు 9510001000 నంబర్‌కు కాల్ చేయాలని ఆయన తెలిపారు.