కోల్‌కతా: బెంగాల్ ఎన్నికల ప్రచారంలో బిజెపి, టిఎంసి అగ్రనేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆదివారం ఉదయం బసీర్‌హత్ దక్షిణ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో హోంమంత్రి అమిత్‌షా ప్రసంగిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మే 2న రాజీనామాకు సిద్ధం కావాలంటూ మమతకు సవాల్ విసిరారు. దీదీ పదేపదే తనను రాజీనామా చేయమంటున్నారు. ప్రజలు కోరినపుడు తాను చేస్తానని అమిత్‌షా అన్నారు. ఈ ఎన్నికల్లో బిజెపి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ మమతను రాజీనామాకు సిద్ధం కావాలని అమిత్‌షా అన్నారు. కేంద్ర బలగాలను ఘెరావ్ చేయాలని మమత పిలుపునిచ్చినందునే ప్రజలు దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. శాంతిపూర్, రాగాఘాట్ దక్షిణ నియోజకవర్గాల్లోనూ ఎన్నికల ర్యాలీలను అమిత్‌షా నిర్వహించారు. సిలిగురిలో ఆదివారం మీడయాతో మాట్లాడిన మమత, కేంద్ర బలగాలపై మరోసారి ఆరోపణలు చేశారు. జనం గుండెలకు గురిపెట్టి కాల్పులు జరిపారని ఆమె విమర్శించారు. గుంపుల్ని చెదరగొట్టాలనుకుంటే కాళ్లమీద కాల్పులు జరపాలన్న అనుభవం కూడా లేదని ఆమె అన్నారు.