Sunday, January 19, 2025

గ్రూప్ 4 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -
  • కలెక్టర్ హరీష్

రంగారెడ్డి జిల్లా: గ్రూప్ 4 పరీక్షల నిర్వహణ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ హరీష్ అధికారులను ఆదేశించారు. బుధవారం గ్రూప్-IV పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్ హరీష్ అదనపు కలెక్టర్ తిరుపతి రావుతో కలిసి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సూపరింటెండెంట్లు, లైజైనింగ్ అధికారులు, రూట్ ఆఫీసర్లుతో ముందస్తు సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జులై 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్- I, మధ్యాహ్నం 2:30 నుండి 5.00 గంటల వరకు పేపర్ -II పరీక్ష ఉంటుందన్నారు. జిల్లాలో మొత్తం 98 వేల 988 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని, అందుకుగానూ మొత్తం 282 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ సెంటర్లను మూసి వేయాలన్నారు. పరీక్షల నిర్వహణ కోసం ప్రత్యేకాధికారులను నియమించనున్నట్లు తెలిపారు.

అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి పరీక్ష కేంద్రాల వద్ద వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలనీ,ఆశ, ఏఎన్‌ఎంలు అందుబాటులో ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి పరీక్షా కేంద్రాలలో పటిష్టమైన చర్యలు చేపట్టాలని, ఎలాంటి పొరపాట్లకు తావియ్యరాదని సూచించారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య పరీక్ష జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.

పరీక్షల నిర్వహణకు లైజన్ అధికారులను నియమించడం జరిగిందని, వారు చీఫ్ సూపరింటెండెంట్లతోపాటు పరీక్ష కేంద్రంలో ఉండి, సమన్వయంతో పని చేయాలని సూచించారు. అన్ని విషయాలలోనూ అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు పరీక్ష కేంద్రాన్ని సందర్శించి, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. చీఫ్ సూపరింటెండెంట్లు గైడ్లైన్స్ అన్నింటిని పునఃశ్చరణ చేసుకోవాలన్నారు. ఇన్విజ్లేటర్లు జాప్యం చేయకుండా కరెక్ట్ టైంకు ఓ ఎం ఆర్ షీట్ అందించే విధంగా ప్లాన్ చేసుకోవాలని టైం ప్రకారం ప్రశ్నా పేపర్ ఇవ్వాలని, టైం పూర్తయిన వెంటనే తీసుకోవాలన్నారు.

ఎక్కువ మంది ఉన్న పరీక్ష కేంద్రంలో అదనంగా అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్‌ను ఏర్పాటు చేయాలన్నారు. వికలాంగులకు గ్రౌండ్ ఫ్లోర్ లోనే పరీక్ష రాసేందుకు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ ఫోన్లు, రైటింగ్ పాడ్స్ అనుమతించరాదనీ తెలిపారు. పరీక్ష కేంద్రాలలోని అన్ని గదులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏవేని సీసీ కెమెరాలు పని చేయనట్లయితే ముందుగా తెలియజేయాలని చీఫ్ సూపరింటెండెంట్ల్లకు సూచించారు. పరీక్షా కేంద్రాల్లో త్రాగునీరు, విద్యుత్,ఫ్యాన్లు, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలు ఉండేలా చూసుకోవాలన్నారు. పరీక్షా సమయంలో నిరంతరాయంగా విద్యుత్తు ఉండేలా చూడాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు.

పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు సకాలంలో చేరుకునేలా ఆయా రూట్లలో తగినన్ని బస్సులను ఏర్పాటు చేయాలనీ ఆర్టీసీ అధికారికి సూచించారు. అదే విధంగా పరీక్ష కేంద్రాల వద్ద మెడికల్ కిట్, ఓఆర్‌ఎస్ పాకెట్లతో ఏఎన్‌ఎమ్‌ను, ఆశా వర్కర్ ను అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. ఆయా అధికారులందరూ సమన్వయంతో పని చేసి గ్రూప్-IV పరీక్షలు సజావుగా నిర్వహించాలని కోరారు.

అభ్యర్థులకు ప్రశ్నాపత్రాలు, ఓ.ఎం.ఆర్ షీట్‌లను ఇచ్చే సమయంలో అభ్యర్థులకు జబ్లింగ్ విధానంపై అవగాహన కల్పించాలన్నారు. జబ్లింగ్‌లో ఏ మాత్రం పొరపాటు జరిగినా పరిగణలోకి తీసుకోవడం జరగదన్న విషయాన్ని తెలియజేయాలన్నారు. గ్రూప్-4 పరీక్షకు 15 నిమిషాల ముందుగా పరీక్ష కేంద్రం గేట్ మూసి వేయాలని, ఉదయం జరిగే పరీక్షకు 8 గంటల నుంచి 9.45 గంటల వరకు, మధ్యాహ్నం జరిగే పరీక్షకు 1 గంట నుంచి 2.15 గంటల వరకు అభ్యర్థులను పరీక్ష కేంద్రాలకు అనుమతించడం జరుగుతుందని, పరీక్షా కేంద్రం గేటు మూసిన తర్వాత ఎవరిని లోపలికి అనుమతించబడదని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న పరీక్షా కేంద్రాలకు ప్రశ్నా పత్రాలను పోలీసుల ఆధ్వర్యంలో స్ట్రాంగ్ రూం నుంచి నిబంధనలు పాటిస్తూ తరలించాలని అన్నారు.

ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక లైజనింగ్ ఆఫీసర్ ఉంటారని, ఆకస్మిక తనిఖీల కోసం ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమిస్తున్నామని తెలిపారు. ఎలాంటి అపశ్రుతులు, లోటుపాట్లకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, అభ్యర్థులు టీ.ఎస్.పీ.ఎస్.సీ నిబంధనలను తు.చ తప్పకుండా పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో చీఫ్ సూపరింటెండెంట్‌లు, లైజనింగ్ అధికారులు, రూట్ ఆఫీసర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News