రేపు పార్లమెంట్‌కు ఆర్థిక సర్వే సమర్పణ
న్యూఢిల్లీ: కేంద్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే ఆర్థిక సర్వే నివేదిక ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని వివరించి, విధాన నిర్ణయాలపై సూచనలు అందచేయడంతోపాటు రానున్న ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయ ఉత్పత్తి(జిడిపి) ప్రగతికి సంబంధించి వేసే అంచనాలు ఇటీవల కాలంలో తరచుగా గురితప్పుతున్నాయి. సోమవారం ఉదయం పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. 2022 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరానికి చెందిన వార్షిక బడ్జెట్‌ను మంగళవారం లోక్‌సభలో ఆమె ప్రవేశపెడతారు. కాగా.. బడ్జెట్‌కు పూర్వం ప్రవేశపెట్టే ఆర్థిక సర్వేకు సంబంధించి అందరూ ఆసక్తిగా ఎదురుచూసేది మాత్రం వచ్చే ఆర్థిక సంవత్సరానికి జిడిపి అంచనాలు ఎలా ఉండనున్నాయన్న అంశమే.
ప్రధాన ఆర్థిక సలహాదారు(సిఇఎ) సారథ్యంలోని బృందం ఈ ఆర్థిక సర్వేను రూపొందిస్తుంది. గత ఏడాది ఆర్థిక సర్వేను దేశంలో కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో సమర్పించడం జరుగగా కరోనా నుంచి దేశం కోలుకున్న దరిమిలా దేశ ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడడంతో ఆ ప్రభావం ప్రస్తుత ఆర్థిక సర్వేలో ప్రతిబింబించే అవకాశం కనపడుతోంది. అంతేగాక జిఎస్‌టి వసూళ్లు పెరగడం, కార్పొరేట్లు లాభాల బాట పట్టడం వంటివి ఆర్థిక స్థితి మెరుగుదలకు సూచనలుగా చెప్పవచ్చు. మూడేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న సిఇఎ కెవి సుబ్రమణియన్ 2021 డిసెంబర్‌లో పదవీ విరమణ చేయగా ఆయన స్థానంలో వి అనంత నాగేశ్వరన్ ఇటీవలే నియమితులయ్యారు. 2021—22 ఆర్థిక సర్వే వచ్చే ఆర్థిక సంవత్సరానికి సుమారు 9 శాతం ఆర్థిక అభివృద్ధి రేటును ఇచ్చే అవకాశం ఉంది. గత ఏడాది జనవరిలో సమర్పించిన ఆర్థిక సర్వే 2021—22 ఆర్థిక సంవత్సరానికి 11 శాతం అభివృద్ధి రేటు అంచనా వేయగా వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక ప్రగతి 9.2 శాతం మాత్రమే సాధించి ఉండవచ్చని ఆర్థిక మంత్రిత్వశాఖ అంచనా వేస్తోంది.