Monday, April 7, 2025

వక్ఫ్ చట్టంలో మార్పులకు రాష్ట్రపతి ఆమోదం

- Advertisement -
- Advertisement -

స్వాతంత్య్రం పూర్వపు ముసల్మాన్ వక్ఫ్ చట్టం రద్దు

న్యూఢిల్లీ : పార్లమెంట్ ఉభయ సభల్లో వాడిగా వేడిగా చర్చ అనంతరం ఇంతకు ముందు పార్లమెంట్ ఆమోదించిన వక్ఫ్ (సవరణ) బిల్లు 2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఆమోద ముద్ర వేశారు. ముర్ము ముసల్మాన్ వక్ఫ్ (రద్దు) బిల్లు 2025ను కూడా ఆమోదించారు. ‘పార్లమెంట్ ఆమోదించిన ఈ దిగువ చట్టానికి శనివారం (5న) రాష్ట్రపతి అంగీకారం లభించింది. ఇందుమూలంగా సాధారణ సమాచారం కోసం ప్రచురించడమైంది: ది వక్ఫ్ (సవరణ) చట్టం 2025’ అని ప్రభుత్వం ఒక నోటిఫికేషన్‌లో తెలియజేసింది. 13 గంటలకు పైగా చర్చ అనంతరం రాజ్యసభ వివాదాస్పద శాసనానికి సమ్మతి తెలిపిన అనంతరం బిల్లును పార్లమెంట్ శుక్రవారం తెల్లవారు జామున ఆమోదించిన విషయం విదితమే.

బిల్లుపై చర్చలో ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అవి బిల్లును ‘ముస్లిం వ్యతిరేకం’గాను, ‘రాజ్యాంగవిరుద్ధం’గాను అభివర్ణించాయి. కాగా, ప్రభుత్వం ఈ ‘చరిత్రాత్మక సంస్కరణ’ మైనారిటీ సమాజానికి ప్రయోజనం కలిగిస్తుందని స్పష్టం చేసింది. రాజ్యసభలో బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది వోటు వేయగా, బిల్లుకు సభ ఆమోదం లభించింది. బిల్లును లోక్‌సభ గురువారం తెల్లవారు జామున ఆమోదించింది. సభలో బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది వోటు వేశారు. కాగా, రాజ్యసభ తన సమ్మతి తెలియజేయడంతో పార్లమెంట్ ముసల్మాన్ వక్ఫ్ (రద్దు) బిల్లును ఆమోదించింది. లోక్‌సభ ఇదివరకే బిల్లుకు ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తరువాత ముసల్మాన్ వక్ఫ్ చట్టం 1923 రద్దు అయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News