న్యూఢిల్లీ : బ్రిటిష్ మహారాణి క్వీన్ ఎలిజబెత్2 అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరవుతారు. ఈనెల 17న ఆమె లండన్ బయల్దేరుతారు. ఈనెల 19న క్వీన్ అంత్యక్రియలు జరుగుతాయి. భారత ప్రభుత్వం తరఫున ద్రౌపది సంతాపం తెలుపుతారు. ఈ వివరాలను విదేశాంగశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. వెస్ట్‌మినిస్టర్ అబ్చేలో జరగనున్న ఈ అంత్యక్రియలకు 9 మిలియన్ డాలర్లు (సుమారు రూ.71 కోట్లు ) ఖర్చవుతుందని అంచనా.
ఆ మూడు దేశాలకు అందని ఆహ్వానం
ఎలిజబెత్ అంత్యక్రియలకు దాదాపు 500 మంది ప్రముఖులు హాజరుకానున్నట్టు సమాచారం. కానీ ఈ కార్యక్రమానికి మూడు దేశాలను మాత్రం బ్రిటన్ పక్కనబెట్టింది. ఉక్రెయిన్‌పై భీకర యుద్ధం చేస్తోన్న రష్యా, మాస్కోకు సన్నిహితంగా ఉండే బెలారస్‌తోపాటు మయన్మార్ దేశాల ప్రతినిధులను మాత్రం ఆహ్వానించలేదు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, న్యూజిలాండ్, కెనడా, ఆస్ట్రేలియా, ప్రధాన మంత్రులు, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమపపోసా, జర్మనీ అద్యక్షడు స్టెయిన్మియర్‌లు హాజరవుతున్నట్టు ఇప్పటికే ఖరారయింది.