- అధికారులు అప్రమత్తంగా ఉండాలి
- సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేయాలి
- కలెక్టర్ అమోయ్ కుమార్
మేడ్చల్ జిల్లా: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జులై 4న హైదరాబాద్ పర్యటన నేపధ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఆదేశించారు.
బుధవారం జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డితో కలిసి రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అమోయ్‌కుమార్ మాట్లాడుతూ ప్రొటోకాల్ నిబంధనలను అనుసరించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో రాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేయాలని అన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రమానికి చేరుకుంటారని చెప్పారు. ఈ మేరకు విమానాశ్రయంలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అన్నారు. రాష్ట్రపతి కాన్వాయ్ ప్రయాణించే మార్గంలో రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని, భారీకేడ్లు ఏర్పాటు చేయాలని రోడ్డు, భవనాల శాఖ ఇఇ శ్రీనివాసమూర్తిని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులకు కలెక్టర్ సూచించారు. నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని, అవసరమైన ప్రాంతాలలో మరమ్మతులు చేపట్టాలని విద్యుత్ అధికారులతో అన్నారు.
హకీంపేట విమానాశ్రయంలో వైద్య సిబ్బందిని, మందులను, అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.పుట్ల శ్రీనివాస్‌కు కలెక్టర్ సూచించారు. హకీంపేట విమానాశ్రయం నుండి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం వరకు రోడ్లను శుభ్రం చేసి పారిశుద్ధ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని తూంకుంట మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, కీసర ఆర్డీవో రవి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.