Saturday, November 9, 2024

చంద్రుడి దక్షిణధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్ రికార్డు: రాష్ట్రపతి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఆదిత్య ఎల్-1 మిషన్‌ను భారత్ దిగ్విజయంగా ప్రయోగించిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. భూమి నుంచి 15 లక్షల కిలో మీటర్ల దూరంలో ఉన్న కక్షలోకి ఆదిత్య ఎల్-1 ప్రవేశించిందని ప్రశంసించారు. చంద్రుడి దక్షిణధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించిందన్నారు. దేశంలో 5జీ నెట్ వర్క్ వేగంగా విస్తరిస్తోందన్నారు. జి20 సమావేశంలో భారత్ విజయవంతంగా నిర్వహించిందని కొనియాడారు. కొత్త పార్లమెంటు భవనంలో తొలిసారి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. కొత్త పార్లమెంటులో తన తొలి ప్రసంగం అని తెలిపారు.

రక్షణ రంగం, అంతరిక్ష రంగంలో కొత్త ఆవిష్కరణలు జరిగాయన్నారు. నారీశక్తి వందన్ అధినీయం బిల్లును ఆమోదించుకున్నామని, నారీ శక్తి వందన్ అధినీయం చట్టం ద్వారా చట్టసభల్లో మహిళలకు 33 శాతం స్థానాలు కేటాయించామని ఆమె చెప్పారు. ఆసియా క్రీడల్లో భారత్ తొలిసారిగా 107 పతకాలు గెలుచుకుందని,  ఆసియా పారా క్రీడల్లో కూడా భారత్ 111 పతకాలు సాధించిందని ముర్ము ప్రశంసించారు. భారత్‌లో తొలిసారిగా నమోభారత్ రైలును ఆవిష్కరించామని, పేదరిక నిర్మూలనే ప్రధాన లక్షంగా భారత్ ముందుకెళ్తోందని స్పష్టం చేశారు. తెలంగాణలో సమ్మక్క-సారక్క గిరిజన వర్సిటీ ఏర్పాటుకానుందని, అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అన్ని అటంకాలు అధిగమించామని, ఎన్నో ఏళ్ల భారతీయ కల… రామమందిర నిర్మాణం సాకారమైందని ముర్ము పేర్కొన్నారు. దేశంలో కొత్త క్రిమినల్ చట్టాన్ని తీసుకొచ్చామని, ఏక భారత్ శ్రేష్ట్ భారత్ నినాదంతో ముందుకెళ్తున్నామని తెలిపారు.

ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంకింగ్ వ్యవస్థలో భారత్ ఒకటి అని, ఆత్మనిర్భర భారత్, మేకిన్ ఇండియా మన బలాలు అని, రూ.4 లక్షల కోట్లు వెచ్చించి దేశమంతా తాగునీటి వసతి కల్పిస్తున్నామని, ఉజ్వల కనెక్షన్లు పది కోట్లు దాటాయని వివరించారు. కరోనా సమయంలో 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందించామని ముర్ము గుర్తుచేశారు. ఏడు లక్షల ఆదాయం వరకు పన్ను లేకుండా చేశామన్నారు. సామాన్యులకు భారం పడకుండా పన్ను సంస్కరణలు చేపట్టామని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News