పివి నరసింహారావు తనయుడు ప్రభాకర్ రావు స్వీకరణ
పివికి భారత రత్న దేశ ప్రజలందరికీ గర్వకారణం: మోడీ
న్యూఢిల్లీ: మరణానంతరం దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నకు ఎంపికైన మాజీ ప్రధాన మంత్రులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ తరఫున వారి వారసులు శనివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాలను అందుకున్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు కుమారుడు పివి ప్రభాకర్ రావు తన తండ్రి తరఫున అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి స్వీకరించారు.
చరణ్ సింగ్ మనవడు, రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్‌ఎల్‌డి) అధ్యక్షుడు జయంత్ చౌదరి అవార్డును అందుకున్నారు. ఎంఎస్ స్వామినాథన్ తరఫున ఆయన కుమార్తె నిత్యా రావు, కర్పూరీ ఠాకూర్ కుమారుడు రాంనాథ్ ఠాకూర్ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతితోపాటు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్, ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కురువృద్ధ నాయకుడు, మాజీ ఉప ప్రధాని ఎల్‌కె అద్వానీతోసహా ఐదుగురికి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది భారత రత్న అవార్డులను ప్రకటించింది.
కాగా..మాజీ ప్రధాన మంత్రులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్‌లతోపాటు స్వామి నాథన్, కర్పూరీ ఠాకూర్ దేశానికి అందచేసిన సేవలను శ్లాఘించిన ప్రధాని నరేంద్ర మోడీ భారత రత్న అవార్డులకు ఎంపిక వారికి ఘన నివాళులర్పించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు దేశానికి చేసిన సేవలను ప్రతి భారతీయుడు స్మచించుకుంటారని మోడీ అన్నారు. ఆయనకు భారత రత్న రావడం ప్రతి భారతీయుడికి గర్వకరాణమని మోడీ తెలిపారు.
దేవ అభివృద్ధి, ఆర్థిక సంస్కరణల కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని మోడీ తెలిపారు. పివి గొప్ప పండితులు, మేధావి అంటూ ఆయన కీర్తించారు. ఆయన సవలను దేశ ప్రజలు ఎన్నటికీ మరచిపోలేరని ఎక్స్ వేదికగా మోడీ తెలిపారు. మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ దేశాభివృద్ధి కోసం ముఖ్యంగా వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి కోసం చేసిన కృషికి భారత రత్న అవార్డు లభించడం ఒక గుర్తింపుగా పేర్కొన్నారు. అదే విధంగా కర్పూరీ ఠాకూర్, ఎంఎస్ స్వామినాథన్ దేశానికి అందచేసిన సేవలను ప్రధాని మోడీ కొనియాడారు.