Saturday, January 4, 2025

భారత రాజ్యాంగం.. సజీవ, ప్రగతిశీలక పత్రం: రాష్ట్రపతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత రాజ్యాంగం సజీవ, ప్రగతిశీలక పత్రం అని, దాని ద్వారానే మనం సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి లక్షాలు సాధించామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఉద్ఘాటించారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన 75వ వార్షికోత్సవం సందర్బంగా ఏడాది పాటు సాగే వేడుకలకు శ్రీకారం చుట్టే కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము ప్రసంగిస్తూ, రాజ్యాంగం రూపకల్పనలో రాజ్యాంగ సభలోని 15 మంది మహిళా సభ్యుల కృషిని గుర్తు చేశారు. ‘మన రాజ్యాంగం సజీవ, ప్రగతిశీలక పత్రం. మారుతున్న కాలాల అవసరాలకు తగినట్లుగా కొత్త ఆలోచనలను అనుసరించే విధానానికి దూరదృష్టి గల మన రాజ్యాంగ నిర్మాతలు అవకాశం కల్పించారు. కొత్త దృక్పథంలో మనం దేశాల సమూహంలో భారత్‌కు కొత్త గుర్తింపును సంపాదిస్తున్నాం’ అని ఆమె చెప్పారు. అంతర్జాతీయ శాంతి, భద్రత పెంపుదలలో ముఖ్య పాత్ర పోషించాలని భారత్‌కు రాజ్యాంగ నిర్మాతలు ఆదేశం ఇచ్చారని రాష్ట్రపతి తెలిపారు.

’75 ఏళ్ల క్రితం, ఇదే రోజు, ఇదే ‘సంవిధాన్ సదన్’ సెంట్రల్ హాల్‌లో రాజ్యాంగ సభ కొత్త స్వతంత్ర దేశం కోసం రాజ్యాంగాన్ని రూపొందించే బృహత్ బాధ్యతను పూర్తి చేసింది’ అని ముర్ము తెలియజేశారు. ఒక విధంగా గొప్ప మేధావులు కొందరు సుమారు మూడు సంవత్సరాలు సాగించిన చర్చల ఫలితమే భారత రాజ్యాంగం అని రాష్ట్రపతి పేర్కొన్నారు. నిజంగా చెప్పాలంటే అదిసుదీర్ఘ స్వాతంత్య్రోద్యమం ఫలితం అని ఆమె అన్నారు. ‘సాటిలేని జాతీయోద్యమ సిద్ధాంతాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. ఆ సిద్ధాంతాలను రాజ్యాంగం పీఠికలో క్లుప్తంగా పొందుపరచడమైంది& అవి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సహోదరభావం. ఆ సిద్ధాంతాలు తర తరాలుగా భారత్‌ను నిర్వచించాయి. రాజ్యాంగం పీఠికలో ప్రధానంగా ప్రస్తావించిన సిద్ధాంతాలు ఒకదానికొకటి సహకరించుకునేవి. ప్రతి ఒక్క పౌరుడు పరిఢవిల్లడానికి, సమాజానికి సేవ చేయడానికి, తోటి పౌరులకు సాయం చేయడానికి అవకాశం పొందే వాతావరణాన్ని అవి సృష్టిస్తున్నాయి’ అని ఆమె చెప్పారు.

కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పౌరులందరి క్రియాశీలక భాగస్వామ్యం నుంచి మన రాజ్యాంగ సిద్ధాంతాలు బలం పుంజుకుంటున్నాయని రాష్ట్రపతి చెప్పారు. ప్రజల ఆకాంక్షలు పార్లమెంట్ ఆమోదించిన అనేక చట్టాల్లో ప్రస్తావనకు చోటు చేసుకున్నాయని ఆమె తెలిపారు. ‘గడచిన కొన్ని సంవత్సరాల్లో ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాలు, ముఖ్యంగా బలహీన వర్గాల అభివృద్ధికి పెక్కు చర్యలు తీసుకున్నది. అటువంటి నిర్ణయాలు ప్రజల జీవితాలను మెరుగుపరిచాయి, అభివృద్ధికి కొత్త అవకాశాలు కల్పిస్తున్నాయి’ అని ఆమె తెలిపారు. మహిళల రిజర్వేషన్‌పై చట్టం భారత ప్రజాస్వామ్యంలో మహిళా సాధికారత కొత్త శకానికి నాంది పలికిందని రాష్ట్రపతి చెప్పారు. ఈ సందర్భంగా రాజ్యాంగం మైథిలి, సంస్కృత వెర్షన్లను కూడా ముర్ము ఆవిష్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News