వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ గత కొన్నేళ్లుగా నిద్రలేమి సమస్యతోబాధపడుతున్నారు. దాదాపు 2008 నుంచి స్లీప్ ఆప్నియా అనే సమస్యతో బైడెన్ ఇబ్బందిపడుతున్నారని, దీంతో ఆయన పడుకునేటప్పుడు గత కొన్ని వారాలుగా సీప్యాప్ (కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెజర్ ) యంత్రాన్ని వాడుతున్నారని శ్వేతసౌధం బుధవారం వెల్లడించింది. మంగళవారం రాత్రి సీప్యాప్ మెషిన్‌ను బైడెన్ ధరించి పడుకోగా, ఆ మచ్చలు ముఖంపై పడ్డాయి. బైడెన్ షికాగోలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఆయన ముఖంపై గీతలు కనిపించాయి. వైట్ హౌస్ నుంచి బైడెన్ బయటకు వచ్చిన సమయంలో ఆయన ముఖంపై గీతలు కనిపించడంతో శ్వేతసౌధం ఈ విషయాన్ని వెల్లడించింది. సాధారణంగా వృద్ధాప్యంలో స్లీప్ ఆప్నియా సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది.
ఇది చాలా మందిలో కనిపించే తీవ్రమైన సమస్య. దీనివల్ల గురక వస్తూ నిద్ర పట్టదు. నిద్రలో ఉన్న సమయంలో గాలిపీల్చుకోడం తరచూ ఆగిపోతూ ఉంటుంది. దాంతో గుండెపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ సమస్య ఉన్నవారు రాత్రి మొత్తం నిద్ర పోయినా ఉదయం పూట అలసిపోయినట్టు ఉంటారు. అమెరికాలో 3 కోట్ల మందిలో ఇటువంటి సమస్య ఉండవచ్చని అంచనా. సీప్యాప్ యంత్రం ఓ మోటార్ సాయంతో గాలిని శ్వాసనాళాల్లోకి పంపుతుంది. దీంతో శ్వాస మెరుగ్గా ఉండి రాత్రంతా హాయిగా నిద్ర పడుతుంది. బైడెన్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా ఆప్నియా కారణంగా ఆయన హృదయ స్పందనల్లో సమస్యలు ఏర్పడుతున్నాయని వైద్యులు గుర్తించారు. మళ్లీ తాజాగా ఆ సమస్య మరోసారి బయటపడింది.