Friday, November 15, 2024

ఢిల్లీ మెట్రో రైలులో రాష్ట్రపతి ముర్ము ప్రయాణం

- Advertisement -
- Advertisement -

భద్రత కాన్వాయ్‌ను విడిచిపెట్టి సామాన్య ప్రయాణికురాలిలా …

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం ఢిల్లీ మెట్రో రైలు, షటిల్ బస్ సర్వీస్ ల్లో ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. ఢిల్లీ మెట్రో రైలులో ఈ విధంగా ప్రయాణించిన రెండో రాష్ట్రపతి ముర్ము అవుతారు. 2012లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కూడా మెట్రో రైలులో ప్రయాణించారు. భారీ భద్రతను విడిచిపెట్టి సామాన్య ప్రయాణికురాలిగా ఆమె కొంతసేపు మెట్రో రైలులో ప్రయాణించడం ప్రయాణికులకు అబ్బురమనిపించింది. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో ముచ్చటించారు. వారి కెరీర్ ప్లాన్ గురించి అడిగి తెలుసుకున్నారు.

రైల్లో సౌకర్యాల గురించి అడిగారు. ఆమె వెంట ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ వికాస్ కుమార్ ఉన్నారు. ఈ సందర్భంగా మెట్రో పనితీరును, ప్రస్తుతం నిర్మాణమవుతున్న వివిధ ప్రాజెక్టులను కుమార్ రాష్ట్రపతికి వివరించారు. కశ్మీర్ గేట్ రాజా నహర్ సింగ్ వైలెట్ లైన్ కారిడార్ లో సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ నుంచి నెహ్రూ ప్లేస్ మెట్రో స్టేషన్ వరకు ఆమె ప్రయాణించారు. తిరిగి సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ వ్యవస్థలో ఎన్‌సిఎంసి ( నేషనల్ కామన్ మొబైలిటీ కార్డు ) రూపే కార్డు ఉపయోగించారు.

విజిటర్స్ బుక్ నమోదులో మెట్రో రైలులోతన ప్రయాణి ఆహ్లాదంగా సాగిందని అభినందించారు. ప్రపంచంలో అత్యంత ఆధునికమైన, సమర్ధవంతమైన ప్రజారవాణా వ్యవస్థగా పేరు పొందిందని, అన్ని ప్రమాణాలతో దీన్ని నిర్వహించడం దేశానికి గర్వకారణమని కితాబు ఇచ్చారు. రాష్ట్రపతి మెట్రో రైలు ప్రయాణం వీడియో వైరల్ అయింది. ఇదే విధంగా సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ (గేట్ నెం.4) నుంచి అమృత్ ఉద్యాన్ (గేట్ నెం. 35) వరకు షటిల్ బస్ సర్వీస్‌లో ప్రయాణించారు. అమృత్ ఉద్యాన్‌ను సందర్శనకు వచ్చే వారి కోసం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటలవరకు ప్రతి 30 నిమిషాలకు ఈ బస్సు సర్వీస్ నడుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News