Monday, January 20, 2025

ఢిల్లీ సర్వీస్‌ల బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అత్యంత వివాదాస్పదమైన “ఢిల్లీ సర్వీస్‌ల బిల్లు” ( జాతీయ రాజధాని ప్రాంత సవరణ బిల్లు 2023) ఇక చట్టంగా మారింది. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన ఈ బిల్లుపై ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కూడా ఆమోద ముద్రవేశారు. దీంతో ఇక ఢిల్లీ సర్వీస్‌ల చట్టం అమల్లోకి వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో ఐఎఎస్‌లు సహా ప్రభుత్వాధికారుల బదిలీలు, నియామకాలపై ఢిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉంటుందని ఈ ఏడాది మేనెలలో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పు వచ్చిన మరుసటి రోజే ఢిల్లీలో అధికారుల బదిలీలపై కేంద్రం ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. గ్రూప్ ఏ అధికారుల బదిలీలు, నియామకాలు , క్రమశిక్షణ చర్యలపై నిర్ణయాలు తీసుకోవడానికి జాతీయ రాజధాని సివిల్ సర్వీస్ అథారిటీని ఏర్పాటు చేసింది.

కమిటీకి ఢిల్లీ ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యవర్గ సభ్యులుగా ఉంటారు. ఇందులో సిఎం మినహా మిగిలిన ఇద్దరు కేంద్ర ప్రభుత్వ నియంత్రణ లోనే ఉంటారు. మెజారిటీ సభ్యుల నిర్ణయం ప్రకారం ఉద్యోగుల బదిలీలు, నియామకాలు జరుగుతాయని ఆర్డినెన్స్ స్పష్టం చేసింది. ఒకవేళ వీరి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే ఎల్జీదే తుది నిర్ణయమని పేర్కొంది. అంటే అధికారమంతా కేంద్రం చేతుల్లోనే ఉంటుంది. దీంతో ఈ ఆర్డినెన్స్‌పై ఆమ్ ఆద్మీపార్టీ ప్రభుత్వం తీవ్రంగా మండిపడింది. ఇటీవల జరిగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఢిల్లీ సర్వీస్‌ల బిల్లును కేంద్రం ప్రవేశ పెట్టగా ప్రతిపక్షాల నిరసనల మధ్య తొలుత లోక్‌సభ, తరువాత రాజ్యసభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపాయి. తాజాగా రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారింది.
అమల్లోకి డేటా ప్రొటెక్షన్ చట్టం
ఢిల్లీ సర్వీస్‌ల బిల్లుతోపాటు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు , జనన, మరణాల నమోదు (సవరణ) బిల్లు, జన్ విశ్వాస్ (సవరణ) బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో అవి కూడా చట్టంగా మారాయి. దేశ పౌరుల డిజిటల్ హక్కులను బలోపేతం చేయడంతోపాటు వ్యక్తిగత సమాచార దుర్వినియోగానికి పాల్పడే కంపెనీలపై కొరడా ఝళిపించేందుకు డేటా ప్రొటెక్షన్ చట్టాన్ని తీసుకొచ్చారు. దీని ప్రకారం ఇకపై డిజిటల్ యూజర్ల డేటా గోప్యతను కాపాడలేక పోయినా, సమాచార దుర్వినియోగానికి పాల్పడినా, సదరు కంపెనీలపై కనిష్ఠంగా రూ. 50 కోట్ల నుంచి గరిష్ఠంగా రూ. 250 కోట్ల వరకు జరిమానా విధించాలనే నిబంధన తీసుకొచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News