న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త ఓటరుకార్డు అందుకున్నారు.ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పి. కృష్ణమూర్తి మంగళవారం స్వయంగా రాష్ట్రపతి భవన్‌కు వచ్చి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కొత్త ఓటరు కార్డును అందజేశారు.ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఎక్స్( ట్విట్టర్) ఖాతా ద్వారా తెలియజేసింది.ఢిల్లీ ఎన్నికల అధికారి కృష్ణమూర్తినుంచి రాష్ట్రపతి ఓటరుకార్డు అందుకున్నట్లు తెలిపింది.
ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్ము గత ఏడాది జులై 25న బారత రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆమె తన ఓటుహక్కును ఒడిశానుంచి ఢిల్లీకి మార్చుకున్నారు. ఆమె రాబోయే ఎన్నికల్లో న్యూఢిల్లీ జిల్లానుంచి తన ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ద్రౌపది ముర్ము పాత ఓటరుకార్డులో ఒడిశాలోని మయూర్భంజ్ నివాసం అడ్రసు ఉంది. రాష్ట్రపతి తన ఓటరుకార్డులోని అడ్రసును ఢిల్లీకి మార్చుకోవడానికి వీలుగా ఢిల్లీ ఎన్నికల ప్రధానాధికారి ఈ నెల ప్రారంభంలో రాష్ట్రపతి భవన్‌ను సందర్శించారు.