Sunday, January 19, 2025

ఆలిండియా జ్యుడీషియల్ సర్వీసుతో మెరుగైన న్యాయం: ద్రౌపది ముర్ము

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రజలకు మరింత మెరుగ్గా న్యాయాన్ని అందించడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు సూచనలు చేశారు.అందుకు ఆల్ ఇండియా జ్యుడీషియల్ సర్వీసును ఏర్పాటు చేయాలన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు ఆదివారం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ రాజ్యాంగంలో న్యాయవ్యవస్థకు ఉన్న ప్రాముఖ్యత అద్వితీయమైనది. బెంచ్ అండ్ బార్‌లో అన్ని వర్గాల వారికి అవకాశం కల్పిస్తే సరైన న్యాయం అందించడం సాధ్యమవుతుంది.ఆల్ ఇండియా జ్యుడీషియల్ సర్వీస్‌ను ఏర్పాటు చేయడం మరింత మెరుగైన న్యాయాన్ని అందించడానికి తోడ్పడుతుంది. అంతేకాకుండా దీన్ని ఏర్పాటు చేసి అన్ని వర్గాలకు చెందిన యువతకు అవకాశం కల్పించవచ్చు. ప్రతిభావంతమైన యువతను దీనికి ఎంపిక చేసి న్యాయమూర్తులుగా తీర్చిదిద్దవచ్చు. ఇది కిందిస్థాయినుంచి ఉన్నతస్థాయి వరకు వారి ప్రతిభను పెంపొందించగలదు’ అని సూచించారు.అల్ ఇండియా జ్యుడీషియల్ సర్వీస్ రూపకల్పన న్యాయప్రక్రియను వేగవంతం చేయడానికి ఒక మార్గమని ఆమె అన్నారు. ఇది ప్రతిభ, పోటీతత్వం,పారదర్శకమైన ప్రక్రియద్వారా న్యాయమూర్తులను నియమించే వ్యవస్థను రూపొందించడమే అవుతుందన్నారు.

కోర్టుకెళ్లేందుకు వెరవొద్దు: సిజెఐ
సుప్రీంకోర్టు ప్రజల న్యాయస్థానంగా పని చేసిందని ఈ కార్యక్రమంలో ప్రసంగించిన సిజెఐ డివై చంద్రచూడ్ అన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి కోర్టులకు వెళ్లడానికి భయపడరాదని, అలాగే చివరి పరిష్కారంగా భావించవద్దని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను, ప్రక్రియల ద్వారా రాజకీయ విభేదాలను పరిష్కరించుకోవడానికి రాజ్యాంగం మనకు ఎలా అవకాశం కల్పిస్తుందో అలాగే వ్యవస్థాపిత సూత్రాలు, ప్రక్రియల ద్వారా అనేక వైరుధ్యాలను పరిష్కరించుకోవడానికి న్యాయవ్యవస్థ మనకు తోడ్పడుతుందని ఆయన అన్నారు.‘ఈ విధంగా దేశంలోని ప్రతికోర్టులో ఉండే ప్రతి కేసు కూడా రాజ్యాంగ పరిపాలనకు పొడిగింపే అవుతుంది’ అని చంద్రచూడ్ అన్నారు.గత 70 ఏళ్లుగా భారత సర్వోన్నత న్యాయస్థానం ఒక ప్రజాకోర్టుగా పని చేసిందని, ఈ వ్యవస్థ ద్వారా తమకు న్యాయం లభిస్తుందన్న నమ్మకంతో వేలాది మంది దీని తలుపులు తట్టారని ఆయన అన్నారు. అక్రమ అరెస్టుల్లో జవాబుదారీ తనం, వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ,నిర్బంధ కార్మికుల హక్కులు, సామాజిక రుగ్మతల నిర్మూలన, గిరిజన భూముల రక్షణ..

ఇలా వివిధ అంశాల కోసం సామాన్య పౌరులు కోర్టును ఆశ్రయించారని చంద్రచూడ్ వివరించారు. ఈ ఉదంతాలన్నీ కేవలం కోర్టు గణాంకాల్లో సమాచారం మాత్రమే కాదని, సుప్రీంకోర్టుపై ప్రజలకున్న విశ్వాసాన్ని ఇవి ప్రతిబింబిస్తాయన్నారు. తీర్పులద్వారా న్యాయాన్ని అందించడమే కాకుండా పౌర కేంద్రీకృత విధానాల రూపకల్పనకూ సుప్రీంకోర్టు నిరంతరం కృషి చేస్తోందని సిజెఐ చెప్పారు. ఫలితంగా కోర్టులు, ప్రజల మధ్య అనుసంధానం పెరిగేలా చూస్తున్నామన్నారు.ప్రజలు కోర్టులకు వెళ్లడానికి జంకవద్దని, అలాగే చివరి ప్రయత్నంగాను భావించవద్దన్నారు.తమ హక్కులను పరిరక్షించుకోవడానికి ఇదే సరయిన వేదిక అని ప్రజలు భావించేలా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్. సంజీవ్ ఖన్నా, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టు ఆవరణలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News