న్యూఢిల్లీ: విద్యాబోధనలో వినూత్న పద్ధతులను అవలంబించి విద్యార్ధుల జీవితాలను సుసంపన్నం చేయడానికి అంకితభావంతో కృషి చేసిన దేశం లోని 44 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ఆదివారం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రదానం చేశారు. ప్రతి విద్యార్థికి ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుందని, దాన్ని గుర్తించి ఆయా విద్యార్థుల మనస్తత్వం, సామాజిక నేపథ్యం, పరిగణన లోకి తీసుకుని వారి అభ్యున్నతికి ఉపాధ్యాయులు కృషి చేయవలసి ఉందని రాష్ట్రపతి సూచించారు. 2021 సంవత్సరానికి గాను స్వయం ప్రకటిత ప్రక్రియ ద్వారా ఆన్‌లైన్ విధానం ద్వారా ఉపాధ్యాయుల ఎంపిక జరిగింది. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. విద్యార్థులు రాజ్యాంగ విలువలకు పౌర విధులకు అంకితమై గౌరవ ప్రదంగా జీవించేలా మన విద్యా విధానం ఉండాలని రాష్ట్రపతి సూచించారు. దేశంపై ప్రేమ పెంపొందేలా, ప్రపంచ ముఖ చిత్రాన్ని మార్పు చేసే ప్రతిభావంతులుగా విద్యార్థులు రాణించే రీతిలో విద్యావిధానం ఉండాలని సూచించారు.