Friday, November 22, 2024

21 శతాబ్దం యువ భారత్‌దే

- Advertisement -
- Advertisement -

పర్యావరణ పరిరక్షణతోనే
భవిష్యత్తు మేలు

ఆరోగ్యం, విద్య, ఆర్థిక సంస్కరణలే కీలకం
జాతినుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్
వీడ్కోలు ప్రసంగం

న్యూఢిల్లీ: కాలుష్యపు తాకిడితో ప్రకృతి మాత తల్లడిల్లుతోందని, వాతావరణ సంక్షోభం ఈ మొత్తం భూగోళం ఉనికికి ముప్పు తెస్తుందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రపతిగా వైదొలుగుతున్న నేపథ్యంలో ఆదివారం ఆయన జాతిని ఉద్ధేశించి ప్రసంగించారు. పర్యావరణ పరిరక్షణతోనే భవిష్య తరాలకు మేలు జరుగుతుంది. రాబోయే తరం ఉనికిని కాపాడేందుకు పర్యావరణ హితంగా అంతా వ్యవహరించాల్సి ఉందన్నారు. 21వ శతాబ్ధం భారతదేశ శతాబ్ధం కావాలనే లక్షం సంకల్పించామని, ఈ దిశలో దేశం అన్ని విధాలుగా సర్వం సన్నద్ధం అయిందని తెలిపారు. దేశ పౌరులు తమ శక్తి సామర్థాలను ఆవిష్కరించుకుని తద్వారా సరైన సంతోషాన్ని అనుభవించాల్సి ఉంటుంది. ఆరోగ్య పరిరక్షణ, విద్యా వికాసం , ఆర్థిక సంస్కరణలు కీలక మార్పులు పౌరులను శక్తివంతులను చేస్తాయని తెలిపారు. ప్రజలను ఉద్ధేశించి ఆయన చేసిన ప్రసంగం టీవీల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. ప్రపంచంతో పాటు దేశంలో కూడా తీవ్ర కలవరం కల్గించిన కొవిడ్ మహమ్మారి మనకు మరింతగా ప్రజా ఆరోగ్య సంరక్షణ సాధనాసంపత్తిని పెంచుకోవల్సిన అవసరం తెలియచేసిందన్నారు. ఈ క్రమంలో అధునాతన వైద్య చికిత్స ఏర్పాట్లను వృద్ధి చేసుకోవల్సి ఉందని అన్నారు. ఈ దిశలో ప్రభుత్వం ప్రాధాన్యతను ఇవ్వడం అభినందనీయం అన్నారు. ఆరోగ్యం విద్యా సౌకర్యాలు ఉంటే జరిగే ఆర్థిక సంస్కరణల ప్రక్రియలలో సరైన మార్గాలను ఎంచుకుని ముందుకు సాగే అవకాశం పౌరులకు ఏర్పడుతుందని కోవింద్ తెలిపారు.

నూతన విద్యా విధానం మేలుకలయిక

ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానం (ఎన్‌ఇపి) కాలక్రమంలో సత్ఫలితాలు ఇస్తుంది. ఇప్పటి మన యువతరం మన మునుపటి చారిత్రక సాంస్కృతిక వారసత్వానికి అనుసంధానం అయ్యేలా చేస్తుంది. ఈ విధంగా యువతరం గత వైభవం సంతరించుకుని రాబోయే 21వ శతాబ్ధిలో తమ పాదం సముచిత రీతిలో మోపగల్గుతారు.

ప్రకృతితో మమేకంతోనే సుకృతి

మనం మన చుట్టూ ఉండే ప్రకృతితో మమేకం అయి తీరాలి. మనరోజువారి జీవిత క్రమం , మన అలవాట్లు అన్ని కూడా మనను రేపటి తరాన్ని నిలబెట్టేవిగా ఉండాలి. చెట్లు చేమలు, సముద్రాలు కొండలు కోనలను పరిరక్షించుకుని తీరాలి. ఎందుకంటే అవి మనను రక్షిస్తాయి. ఇప్పటి ప్రధమ పౌరుడిగా ఏదైనా సలహా ఇవ్వడం అంటూ ఉంటే ప్రకృతికి అనుగుణంగా వ్యవహరిద్ధామనే సలహానే ఇస్తానని రామ్‌నాథ్ కోవింద్ స్పష్టం చేశారు. బతుకు క్రమం ప్రకృతి చట్రంలో ఇమిడి ఉంటుంది. ఈ చట్రం పరిధిలోనే మన దైనందినత జీవిత క్రమం ఉండాల్సిందే.

స్వేచ్ఛ సమానత సోదరత్వమే కీలకం

మనకు మూడు ఆదర్శాలు ఉత్తమ దిశకు నడిపిస్తాయి. స్వేచ్ఛ, సమానత, సౌభాతృత్వం త్రివిధ ఆదర్శాలుగా నిలిచాయి. ఇవి కొనియాడదగ్గవి. వీటిని బలహీనతల చిహ్నంగా భావించుకోరాదని , వీటితోనే అభ్యున్నతికి వీలు ఏర్పడుతుందని తెలిపారు. మన చరిత్ర ఆధునిక కాలంలోనూ , ప్రాచీన దశల్లోనూ మన మూడు సలక్షణాల ఘనతలను ఘటనల వారిగా నిరూపించాయి. అవే వాస్తవికతలని తేల్చాయి. వివిధ కాలాలలో వీటిని మనం గుర్తించి బలోపేతానికి యత్నిస్తూ వచ్చాం . మన పూర్వీకులు, ఆధునిక దేశ వ్యవస్థాపకులు కూడా మనకు న్యాయం, స్వేచ్ఛ, సమానతలను సౌభాతృత్వాన్ని చాటి చెప్పారు. శ్రమించే తత్వం , సేవాగుణం వంటివి మనకు గోచరిస్తూ వచ్చాయి. ఇప్పుడు మనం ఆ అడుగుజాడల్లో నడిస్తే సరిపోతుంది అని రాష్ట్రపతి తెలిపారు.

మట్టి ఇంటివాడు దేశ రాష్ట్రపతి అయ్యాడు

దేశ ప్రజాస్వామ్యానికి ఉన్న ఘనత సాటిలేనిది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో పలువురిలాగానే తనకు కూడా పలు విధాలుగా నూతన శక్తి , ఏదో సాధించబోతున్నామనే లక్షాలు సంతరించుకుని నిలిచాం. దేశ పునర్నిర్మాణం క్రమంలో కొత్త కలలను కన్నామని రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు. దేశ నిర్మాణ ప్రక్రియలో పాలుపంచుకోవాలనుకున్నాం అన్నారు. ఓ మట్టి పెంకుల ఇంట్లో బాలుడిగా పెరిగిన తనకు దేశ గణతంత్ర రాజ్యాంగ అత్యున్నత వేదిక రాష్ట్రపతి భవన్ పదవి కావాలనుకోవడం వెర్రి ఆశ అవుతుంది. అయితే భారతదేశ ప్రజాస్వామ్యానికి ఉన్న శక్తి ఈ కలను నిజం చేసింది. సామాన్యుడు కూడా అసమాన్యుడు అవుతాడనే అంశాన్నిన తేల్చిచెప్పింది. మనం దేశ సమిష్టి భవితను ఖరారు చేసుకునే ప్రక్రియలో భాగస్వామ్యం అయితే ఈ దిశలో మనకు సమున్నత స్థానం స్వతహసిద్ధంగానే ఏర్పడుతుంది. మన మన పూర్వీకుల గ్రామాలను విస్మరించరాదు. మనం ఎక్కడున్నా, ఎంతటివారిమైనా జన్మించిన ఊరి కోసం పరితపించాల్సి ఉంటుంది. తన జీవితంలో తాను మరిచిపోలేని ఘట్టం తాను రాష్ట్రపతి అయిన తరువాత తన గ్రామానికి వెళ్లడం, అక్కడ తన ఉపాధ్యాయులు, ఆత్మీయులైన పెద్దలకు పాదాభివందనం చేయడం అని కోవింద్ తెలిపారు.

పరౌంక్ గ్రామ బాలుడిని రాష్ట్రపతినయ్యా

మారుమూల పరౌంఖ్ గ్రామంలో జన్మించిన ఈ రామ్‌నాథ్‌ను ఇప్పుడు రాష్ట్రపతి పదవి తరువాత మీతో మాట్లాడుతున్నానంటే ఇది కేవలం మన పటిష్ట ప్రజాస్వామ్యానికి ఉన్నశక్తితోనే సాధ్యం అయింది. ఈ విధంగా తాను ఈ ప్రజాస్వామ్యపు అంతర్గత శక్తికి ఎప్పుడూ రుణపడి ఉంటా….ఇప్పుడు రాష్ట్రపతిగా సెలవు తీసుకుంటున్నా, రాష్ట్రపతిగా ఈ అత్యున్నత గౌరవ అవకాశాన్ని మననం చేసుకుంటూ దీనికి ఎప్పుడు సెలవు ప్రకటించకుండా ఉంటా అని రామ్‌నాథ్ కోవింద్ సవినయంగా ప్రకటించారు. దేశ 14వ రాష్ట్రపతిగా పూర్తి కాలం పూర్తి చేసుకుని వీడ్కోలు దశలో జాతితో తన భావోద్వేగాన్ని పంచుకున్నారు. తన తోటి పౌరులు, ప్రజా ప్రతినిధులకు ఎందరో ప్రముఖులకు పేరు మోసిన పేరు లేకున్నా గొప్పవారుగా ఉన్న వారెందరికో రుణపడి ఉంటానని , తనకు సంపూర్ణ శక్తిని ప్రసాదించిన అంశం తాను గ్రామాల రైతులు, కూలీలు, శ్రామికులతో జరిపిన మాటామంతితోనే అని తేల్చిచెప్పారు. యువ మేథస్సులకు ఆవిష్కరణలు పలికే ఉపాధ్యాయులు, మన పూర్వ వారసత్వ వైభవానికి శోభలు తీర్చే కళాకారులు, మన దేశ బహుముఖ ముఖచిత్రాలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేసే మేధావులు, దేశ సంపదను మరింత బలోపేతం చేసే వ్యాపారవేత్తలు ఈ విధంగా అందరికి ఇన్నాళ్ల దేశ ప్రధమ పౌరుడిగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నానని అంటూ వారి నుంచి సెలవు తీసుకుంటున్నానని తెలిపారు.

నిరుపేద ముఖం తల్చుకుని నడువు

మహాత్మా గాంధీ తరచూ చెపుతూ ఉండేవారు. ఏదైనా పనిచేసేటప్పుడు నిర్ణయం తీసుకునే ముందు నిరుపేదల ముఖాలను ఓ క్షణం గుర్తుతెచ్చుకోండి. మనం చేసేది ఏదైనా వారి బాగుకు ఉపయోగపడుతుందా? ఆలోచించుకోండి. దీనిని పాటించిన వ్యక్తిగా అందరు కూడా గాంధీజి ఇటువంటి బోధనలను ఆచరించాలని తెలిపారు. రోజులో కొద్ది నిమిషాలైనా గాంధీజి ఆలోచనలు, ఆయన జీవితాన్ని తరచిచూడాల్సి ఉంటుంది. అప్పుడు దేశానికి ఎంతో చేసిన వారమవుతామని రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News