కొవిడ్‌తో రిపబ్లిక్ డే వేడుకలు మూగబోవచ్చు కానీ సమైక్యతా స్ఫూర్తి శాశ్వతం
రిపబ్లిక్ డే సందేశంలో రాష్ట్రపతి రామ్‌నాధ్ కొవింద్
న్యూఢిల్లీ : ఒకే దేశంగా సమైక్యతా స్ఫూర్తితో ఏటా రిపబ్లిక్ డే ఉత్సవాలను జరుపుకొంటున్నామని, మన ప్రజాస్వామ్య వైవిధ్యం, ప్రకంపనలు ప్రపంచ దేశాల ప్రశంసలను చూరగొంటున్నాయని బుధవారం రిపబ్లిక్ డే సందర్భంగా జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాధ్ కొవింద్ ఈరోజు రాత్రి (మంగళవారం) సందేశం ఇచ్చారు. కొవిడ్ మహమ్మారి కారణంగా రిపబ్లిక్ డే వేడుకలు మూగపోవచ్చు కానీ సమైక్యతా స్ఫూర్తి మాత్రం శాశ్వతంగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. మానవ జాతికి కరోనా మహమ్మారి అసాధారణమైన సవాలని, అయినా డాక్టర్లు, నర్సులు, వైద్యసిబ్బంది ఈ సవాలును సమష్టిగా స్వీకరించి తమ ప్రాణాలను పణంగా పెట్టి క్లిష్టపరిస్థితుల్లోనూ ఎక్కువ గంటలు పనిచేస్తూ సాటిలేని సంకల్పంతో కొవిడ్ రోగులను రక్షించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ఇదెంతో మనకు గర్వకారణమన్నారు. కొవిడ్ విషయంలో విషయంలో నిత్యం అప్రమత్తంగా ఉండాలని, స్వయం రక్షణ తగ్గించుకోరాదని, రాష్ట్రపతి తన సందేశంలో వివరించారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి వివరిస్తూ జైహింద్ అనే నినాదాన్ని శక్తివంతమైన అభివాదంగా నేతాజీ స్వీకరించారని, రెండు రోజుల క్రితం జనవరి 23న మనమంతా నేతాజీ 125 వ జయంతిని జరుపుకున్నామని రాష్ట్రపతి ప్రస్తావించారు. దేశ స్వాతంత్య్రం కోసం ఆయన తపన, దేశాన్ని గర్వకారణంగా తీర్చి దిద్దాలన్న ఆయన ఆశయం మనందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, సమ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం తదితర మార్గదర్శక సూత్రాలతో మన రాజ్యాంగం రూపొందిందని, ఈ సూత్రాల పునాదిపైనే మన రిపబ్లిక్ నిలుచుందని అభివర్ణించారు. మన సామూహిక వారసత్వం నుంచి ఈ విలువలు మనకు సంతరించుకున్నాయని వివరించారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోగలిగేలా మన దేశం ఉన్నత స్థానంలో ఉందని, దేశం మున్ముందు ఇదే విధానంలో ప్రగతి బాటలో కొనసాగుతుందని ప్రపంచ సమాజంలో తగిన సామర్ధంతో నిలుస్తుందని చెప్పారు. సైనిక దళాల్లో మహిళలను చేర్చుకోవడాన్ని ప్రస్తావిస్తూ మన తనయలు అద్దాల సీలింగ్‌ను ఛేదించారని, ఆర్మీ దళాల్లో మహిళా అధికారుల ప్రవేశానికి వీలుగా శాశ్వత కమిషన్ ఏర్పాటైందని వివరించారు.