న్యూఢిల్లీ: కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడానికి వారం రోజులే గడువుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ కొత్త పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించాలే తప్ప ప్రధాని నరేంద్ర మోడీ కాదన్నారు. ‘కొత్త పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతే ప్రారంభించాలి. ప్రధాని కాదు’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
కొత్త పార్లమెంటు భవనం ఆవిష్కరణ మే 28న జరుగనున్నది. కాగా ‘2023 మే 28న కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీయే ప్రారంభించనున్నారు. అది కూడా గొప్ప భారత పుత్రుడు వినాయక్ దామోదర్ సావర్కర్ 140వ జయంతి నాడు’ అని బిజెపి ఐటి విభాగం ఇన్‌ఛార్జీ అమిత్ మాల్వియా ట్వీట్ చేశారు.
‘వీర్ సావర్కర్ 1883 మే 28న భాగూర్‌లో జన్మించారు. కొత్త పార్లమెంటు కనీసం 150 ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉండేలా రూపొందించబడింది. ప్రస్తుత ప్రాంగణం 100 ఏళ్లుగా ఉంది’ అని మాల్వియా తెలిపారు. కొత్త పార్లమెంటు భవనంను త్రిభుజాకారంలో నాలుగు అంతస్తులతో 64500 చదరపు మీటర్లలో నిర్మించారు. ఇందులో 1224 మంది ఎంపీలకు వసతి ఉంటుంది. ఇందులో లైబ్రరీ, అనేక కమిటీ గదులు, డైనింగ్ గదులు ఉన్నాయి. దీనిని టాటా ప్రాజెక్ట్ రూ. 970 కోట్ల వ్యయంతో నిర్మించింది. కొత్త పార్లమెంటు భవనాన్ని కాంగ్రెస్ ‘మోడీస్ వ్యానిటీ ప్రాజెక్ట్’ అని అభివర్ణించింది.
नए संसद भवन का उद्घाटन राष्ट्रपति जी को ही करना चाहिए, प्रधानमंत्री को नहीं!
— Rahul Gandhi (@RahulGandhi) May 21, 2023