Saturday, December 21, 2024

ఆలయాన్ని శుభ్రం చేసిన రాష్ట్రపతి అభ్యర్థి

- Advertisement -
- Advertisement -

నిరాడంబరతను చాటుకున్న ముర్ము
విస్మయంగా చూసిన స్థానికులు
27న నామినేషన్ దాఖలు
జడ్ ప్లస్ కమాండో భద్రత కల్పించిన
కేంద్ర ప్రభుత్వం

రాయ్‌రంగపూర్ (ఒడిశా): రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డిఎ అభ్యర్థిగా ఖరారైన ద్రౌపది ముర్మూ బుధవారం యధాప్రకారం తమ నిరాడంబరతను చాటుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఒడిశా మయూర్‌భంజ్ జిల్లా లోని తన స్వ గ్రామం రాయ్‌రంగ్‌పూర్‌లోని శివాలయానికి బుధవారం తెల్లవారు జామున వెళ్లి 3, 4 గంటల మధ్య చీపురుపట్టి స్వతహాగా ఆలయాన్ని శుభ్రం చేశారు. జార్ఖండ్ గవర్నర్‌గా 2021 ఆగస్టు లో రిటైరైన దగ్గర నుంచి ఆమె రోజూ ఈ విధంగా ఆలయాన్ని శుభ్రం చేయడం తన దినచర్యగా సాగుతోంది. ఇప్పుడు రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికై నా సరే తన విధిని ఆమె విడిచిపెట్టక పోవడం విశేషం. ఎరుపు అంచుగల దంతం రంగు చీర కట్టుకుని చీపురు పట్టి గుడిని శుభ్రం చేసిన తరువాత శివుడికి పూజలు చేశారు. గుడిలోని నంది చెవిలో గుసగుసలాడారు. స్థానికులు వందలాది మంది అక్కడకు చేరి ఆమెను ఆశ్చర్యం గా చూశారు.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపికైన తరువాత జడ్‌ప్లస్ కేటగిరి భద్రత కల్పించింది. దాం తో సిఆర్‌పిఎఫ్ కమాండోలు ఆమెకు రక్షణ కవచంలా ఉన్నారు. ఆమె ఆలయం నుంచి బయటకు వచ్చేసరికి భారీ ఎత్తున జనం ఆమెకోసం తెల్లవారు జాము నుంచే వేచి ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. ఈశ్వరీయ ప్ర జాపతి బ్రహ్మకుమారీ సంస్థ ప్రతినిధులు ఇద్దరు ఆమెకు అభినందనలు తెలిపారు. ఆలయంలో పూజలు ముగించుకుని ద్రౌపది ముర్మూ తన ఇంటికి వచ్చేశారు. ప్రజలు, అధికార పార్టీ బిజెడి తోసహా వివిధ పార్టీల నాయకులను కలుసుకుని ఆమె మాట్లాడారు. తరువాత ఆమె కారులో 285 కిమీ దూరంలో ఉన్న భువనేశ్వర్‌కు బయలుదేశారు. భువనేశ్వర్‌లోని ప్రజలు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరి పూలవర్షం కురిపించారు. గిరిజన సంప్రదాయ నృత్యం చేస్తూ పండగలా ప్రజలంతా స్వాగతం పలికారు. గిరిజన తెగ ప్రజలకు ఆమె అభ్యర్థిత్వం ఘన విజయంగా అభివర్ణించారు. భువనేశ్వర్ నుంచి ఆమె ఢిల్లీకి విమానంలో వెళ్తారు.

27 న నామినేషన్ దాఖలు

రాష్ట్రపతి ఎన్నికల ఎన్‌డిఎ అభ్యర్థిగా జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్మూ ఈ నెల 27న నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రధాని నరేంద్రమోడీతోసహా కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మద్దతుదారులైన బిజూ జనతాదళ్ నేతలు ఆమెతో నామినేషన్ సందర్భంగా ఉండవచ్చని అంటున్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రధాని మోడీ మొదట ప్రతిపాదిస్తారు. రాష్ట్రపతి అభ్యర్థికి 50 మంది ప్రతిపాదించవలసి ఉండగా, మరో 50 మంది మద్దతు ఇవ్వాలి.

బీహార్ సిఎం నితీష్ కుమార్ సంతోషం

ఎన్‌డిఎ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మూ ఖరారు కావడంపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్రమోడీ ఈ విషయం తనకు ఫోన్ ద్వారా తెలియచేశారని, గిరిజన మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు మోడీకి కృతజ్ఞతలు తెలియజేశానని నితీష్ వెల్లడించారు.

మాకెంతో గర్వకారణం : నవీన్‌పట్నాయక్

ఒడిశా సుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన ద్రౌపది ముర్మూకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అభినందనలు తెలిలపారు. ప్రధాన మంత్రి ఈ విషయంపై చర్చించినప్పుడు చాలా సంతోషించాను. ఇది ఒడిశా ప్రజలకు ఎంతో గర్వకారణం. అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి బిజెపి ప్రధాన కార్యాలయంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆమె అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకున్నారు. సుమారు 20 పేర్లను వడపోసిన తరువాత దేశం లోని తూర్పు రాష్ట్రాలకు ప్రాథాన్యం ఇవ్వాలని, ఇప్పటివరకు రాష్ట్రపతి పదవి చేపట్టని ఎస్టీలకు ఎన్డీయే ద్వారా ఆ గౌరవం కల్పించాలన్న ఉద్దేశంతో ఆమెను ఎంపిక చేసినట్టు బిజెపి అధ్యక్షుడు జెపీ నడ్డా ప్రకటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News