Wednesday, January 22, 2025

రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఆపరేషన్ కమల్

- Advertisement -
- Advertisement -

భోపాల్: అధికారంలో ఉన్న బిజెపి చివరికి రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియను కూడా భ్రష్టు పట్టించిందని విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా విమర్శించారు. ఇటీవలి పరిణామాలను చూస్తూ ఉంటే రాష్ట్రపతి ఎన్నికలలోనూ బిజెపి ‘ఆపరేషన్ కమల్’ ఆటకు దిగుతోందని సిన్హా స్పందించారు. అత్యున్నత రాజ్యాంగ పదవికి జరిగే ఎన్నికలలోనూ బిజెపి పార్టీలను ప్రలోభపర్చడం, ఇతరత్రా అక్రమాలకు దిగడం వంటి చర్యలకు దిగుతోందని, ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. బెదిరింపులు, డబ్బుల ఎర చూపడం వంటి పరిణామాలు బాధ కల్గిస్తున్నాయని వ్యాఖ్యానించారు. బిజెపియేతర ఎమ్మెల్యేలకు గాలం వేసేందుకు భారీ స్థాయిలో డబ్బు ఆశలు చూపుతున్నారని, ఇంతకంటే దారుణం ఉంటుందా? అని ప్రశ్నించారు.

ఈ ఎన్నిక స్వేచ్ఛగా సజావుగా సాగితే ఫలితం వేరే విధంగా ఉంటుందని బిజెపికి భయం పట్టుకుంది. అందుకే ఈ విధంగా దొడ్డిదారులు తొక్కుతోందని ఆరోపించారు. పెద్ద ఎత్తున ఓట్లను ఆకట్టుకునేందుకు సాగిస్తోన్న ఆపరేషన్ కమల్ ప్రజాస్వామిక విలువలకు పాతర వేసేలా ఉందన్నారు. మధ్యప్రదేశ్ పర్యటన సందర్భంగా ఆయన గురువారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలిసి మాట్లాడారు. తన అభ్యర్థిత్వానికి మద్దతు కోసం సిన్హా భోపాల్ వచ్చారు. కాంగ్రెస్‌కు చెందిన 26 మంది గిరిజన ఎమ్మెల్యేలపై బిజెపి కన్నేసిందని, వారిని ప్రలోభపెట్టేందుకు యత్నిస్తోందని మధ్యప్రదేశ్ నుంచి వెలువడే ఓ పత్రిక ప్రచురించిన వార్తను యశ్వంత్ ప్రస్తావించారు.

Presidential Election 2022: Yashwant Sinha slams BJP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News