Monday, December 23, 2024

జులై 18న రాష్ట్రపతి ఎన్నిక

- Advertisement -
- Advertisement -

Presidential Election Schedule Released

15 నుంచి నామినేషన్ల ప్రక్రియ
అవసరమైతే 21న ఎన్నిక 25న కొత్త రాష్ట్రపతి పదవీ స్వీకారం

న్యూఢిల్లీ: భారతదేశ 16వ రాష్ట్రపతి ఎన్నికలు జులై 18వ తేదీన జరుగుతాయి. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (సిఇసి) గురువారం అధికారికంగా ప్రకటించింది. అన్ని ప్రక్రియలు పూర్తి తరువాత అవసరం అయితే ఓటింగ్ ఆ తరువాత ,ఓట్ల లెక్కింపు జులై 21వ తేదీన జరుగుతుంది. రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 15న ఆరంభం అవుతుంది. అంతకు ముందు ఎప్పుడైనా నోటిఫికేషన్ వెలువడుతుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఈ నెల 29 అని భారత ఎన్నికల సంఘం ప్రధానాధికారి(సిఇసి) రాజీవ్‌కుమార్ విలేకరులకు తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛగా సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సర్వం సమాయత్తం అయిందని కుమార్ తెలిపారు. కొవిడ్ కోడ్ ఖచ్చితంగా పాటించడం జరుగుతుంది. ఏ పార్టీ కూడా ఎన్నికలలో ఓట్ల విషయంలో విప్‌లు జారీ చేయకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నామినేషన్ల పరిశీలన ఈనెల 30న ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ చివరి గడువు జులై 2. అవసరం అయితే ఓటింగ్ జులై 18న జరుగుతుంది, 21న కౌంటింగ్ చేపడుతారని రాజీవ్ కుమార్ తెలిపారు. ఎంపిలు, ఎమ్మెల్యేలతో కూడిన 4809 ఎలక్టోర్స్ (ఓట్లు కలిగిన వారు) రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటారు. నూతన రాష్ట్రపతి జులై 25వ తేదీన ప్రమాణస్వీకారం చేస్తారని కమిషన్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. ఆయన రెండోసారి రాష్టపతి అయ్యే అవకాశం లేదని వెల్లడవుతోంది. ఈ క్రమంలో ఈ అత్యున్నత అధికారిక పీఠానికి అభ్యర్థి పోటీ వివరాలు త్వరలోనే తెలుస్తాయి. దేశ తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ఒక్కరే దేశానికి రెండు పర్యాయాలు ప్రధమ పౌరుడు అయ్యారు. తరువాత ఇతరులు ఎవ్వరికి ఈ అవకాశం దక్కలేదు. ఏకగ్రీవ అభ్యర్థి కోసం తాము అన్ని విధాలుగా యత్నిస్తామని పలుమార్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే పోటీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయనే అంశం ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో మరింత ఎక్కువగా కన్పిస్తున్నాయి. ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. అయితే ప్రతిపక్షాల మధ్య ఈ విషయంలో సయోధ్య కుదరడం అంత తేలిక కాదని భావిస్తున్నారు. ప్రతిపక్ష రాజకీయాలలో ఇటీవలి కాలంలో కీలక స్థాయిలో సమీకరణలలో మార్పు చోటుచేసుకుంది. ప్రత్యేకించి చిరకాలం అధికారంలో ఉండి బలమైన ప్రతిపక్షంగా నిలిచిన కాంగ్రెస్ వరుస పరాజయాలతో, అంతర్గత గందరగోళాలతో డీలా పడింది. 2014 సార్వత్రిక ఎన్నికల తరువాతి క్రమంలో పలు ఎన్నికలలో కాంగ్రెస్ దయనీయ ఫలితాలు పార్టీని ప్రతిపక్ష ఐక్యతా సారధ్యానికి దూరం చేశాయి.
జులై 24తో కొవింద్ పదవీకాలం పూర్తి
వచ్చే నెల 24వ తేదీన రామ్‌నాథ్ కొవింద్ పదవీకాలం ముగుస్తుంది. 2017లో బిజెపి తమ రాష్ట్రపతి అభ్యర్థిగా కొవింద్‌ను ఎంచుకుంది. దళిత నేత, అప్పటివరకూ బీహార్ గవర్నర్‌గా ఉన్న కొవింద్ ఎంపికతో ప్రతిపక్ష శిబిరంలో పోటీ అభ్యర్థిపై సందిగ్ధత తద్వారా చీలికలు తలెత్తాయి. అప్పట్లో ఎన్నిక తరువాత దేశానికి 14వ రాష్ట్రపతిగా కొవింద్ బాధ్యతలు తీసుకున్నారు. చాలా వరకూ ఎటువంటి వివాదాలకు తావులేకుండా హుందాగా పదవీ కాలం పూర్తి చేసుకున్నారనే విశ్లేషణలు వెలువడ్డాయి. అప్పట్లో ఆయనకు పోటీదారుగా మాజీ స్పీకర్ మీరాకుమార్ నిలిచారు. అయితే ఆమెను పోలయిన ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లలో ఆయన 65.65 శాతం ఓట్లతో ఓడించారు. అప్పుడు పోలయిన ఓట్లు 7,02,044గా ఉన్నాయి. సాధారణంగా ప్రస్తుత రాష్ట్రపతి పదవీకాలం పూర్తికి ముందుగానే కొత్త రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంటుందని రాజ్యాంగంలోని 62వ అధికరణ తెలియచేస్తోంది.
పరోక్ష ఎన్నికనే.. ఎలక్టోరల్ కాలేజ్ కీలకం
దేశ రాష్ట్రపతి ఎన్నిక పూర్తిగా ఎలక్టోరల్ కాలేజ్ సభ్యుల ఓట్లతో జరుగుతుంది. పార్లమెంట్ ఉభయసభల సభ్యులు అంటే ఎంపీలు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీల సభ్యులు, అదే విధంగా కేంద్ర పాలిత ప్రాంతాల ప్రజా ప్రతినిధులు ఓట్లతో ఎలక్టోరల్ కాలేజ్ ఏర్పాటు అవుతుంది. ఓట్ల విలువను బట్టి గెలుపోటములు ఖరారు అవుతాయి. మొత్తం మీద 776మంది పార్లమెంటేరియన్లు, 4033 మంది లెజిస్లేటర్లు ఓటు వేసే అర్హత దక్కించుకుంటారు. ఇక మొత్తం లెజిస్లేటర్ల ఓట్ల విలువ 5,43,231. ఇక ఎంపిల ఓటు విలువ మొత్తం మీద 5,43,200. మొత్తం మీద 4809 ఎలక్టోరల్, ఇక ప్రతి ఓటు విలువ ఒక్కొక్కటి 10,86,434గా ఉంటుంది. రాజ్యసభలో 57 ఖాళీ స్థానాల ఎన్నికల ప్రక్రియకు ఒక్కరోజు ముందు ఎన్నికల సంఘం రాష్ట్రపతి ఎన్నికల తేదీని అధికారికంగా ప్రకటించింది. రాజ్యసభ ఖాళీల భర్తీ ప్రక్రియ మొత్తం 15 రాష్ట్రాలకు విస్తరించుకుని ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News