Thursday, March 13, 2025

పడగ నీడలో పాత్రికేయం

- Advertisement -
- Advertisement -

మన దేశం ప్రజాస్వామ్యమే అయినప్పటికీ రానురాను పాలకుల్లో నియంతృత్వ పోకడలు పెచ్చుమీరుతున్నాయి. పత్రికా స్వేచ్ఛకు అనేక ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. పత్రికా స్వేచ్ఛ అంటే భావప్రకటన స్వాతంత్య్రం. దేశంలో జరుగుతున్న పరిణామాలపై నిర్భయంగా అభిప్రాయాన్ని ప్రకటించే స్వేచ్ఛ. అలా ఎవరైనా పాత్రికేయులు తమ విధులను నిర్వర్తిస్తే వారికి రక్షణ కరవై ప్రాణాలతో చెలగాటమాడే దుస్థితి ఎదురైతే పత్రికాస్వేచ్ఛ అన్నది శూన్యమైనట్టే. అంతేకాదు ప్రజాస్వామ్యం కూడా అడుగంటిపోయినట్టే అవుతుంది. ప్రజాస్వామ్యభవనానికి ఉన్న నాలుగు స్తంభాల్లో పాత్రికేయం కూడా ఒకటి అన్న వాస్తవం మరిచిపోరాదు. కానీ ఇప్పుడు చాలావరకు పడగనీడలో పాత్రికేయం బిక్కుబిక్కుమంటూ మనుగడ సాగిస్తోంది. అవినీతిని, అక్రమాలను బయటపెట్టే పరిశోధనాత్మక కథనాలకు ప్రమాదం పొంచి ఉంటోంది.

దీనికి తాజా ఉదాహరణ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దైనిక్ జాగరణ్ దినపత్రిక విలేకరి రాఘవేంద్ర వాజ్‌పేయ్‌ని పట్టపగలే కొందరు దుండగులు అత్యంత పాశవికంగా హత్యచేయడం. వాజ్‌పేయ్‌ని కాల్చిచంపి మోటార్ సైకిల్‌ను తగులబెట్టారు. సీతాపూర్‌లో దైనిక్ జాగరణ్ విలేకరిగా పనిచేస్తున్న వాజ్‌పేయి రాస్తున్న వార్తా కథనాలే ఉరితాళ్లుగా మారాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జర్నలిస్టులపై ఇలాంటి కిరాతక చర్యలు సాగుతుండడం పరిపాటి అయింది. సంఘ విద్రోహులు ఎలాంటి అడ్డూఆపూ లేకుండా విచ్చలవిడిగా పేట్రేగిపోతున్నా ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కానీ, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కానీ ఎలాంటి నివారణ చర్యలు చేపట్టకపోవడం మన ప్రజాస్వామ్య వ్యవస్థకే తీరని కళంకం. చైనా నుంచి నిధులు అందుతున్నాయంటూ 2023లో ఆన్‌లైన్ న్యూస్‌పోర్టల్ న్యూస్‌క్లిక్ కార్యాలయాలపై కేంద్ర ప్రభుత్వమే దాడులు జరిపించడం తీవ్ర సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఆనాడు ఏకకాలంలో 100కి పైగా ప్రాంతాల్లో సాగిన ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు సహా మరి కొంతమంది సీనియర్ జర్నలిస్టులను విచారణ పేరుతో స్పెషల్ సెల్‌కు తీసుకొచ్చినట్టు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

ప్రధాన మంత్రి మోడీని, ఆయనకు మద్దతు ఇచ్చే హిందూ జాతీయవాదుల నేతృత్వంలోని పాలకవర్గాన్ని, మతోన్మాదాన్ని తీవ్రంగా విమర్శించడమే న్యూస్‌క్లిక్ సంస్థపై దాడులకు కారణం. స్వతంత్ర జర్నలిస్టులను వేధించడానికి, బెదిరించడానికి ప్రయత్నాలు అదే పనిగా జరుగుతున్నాయి. దాడులకు వ్యతిరేకంగా మాట్లాడిన మానవ హక్కుల ఉద్యమ నేతలు అరుంధతీరాయ్‌కు కూడా బెదిరింపులు తప్పలేదు. ఉగ్రవాద నిరోధక చట్టం, చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (ఉపా) వంటివి కూడా పాలకులు ఈ సందర్భంగా ప్రయోగిస్తున్నారు. మణిపూర్‌లో సమాచార దిగ్బంధనం చేశారు. జర్నలిస్టుల గళాలు, కలాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. 2023లో మణిపూర్ సంఘర్షణలపై మీడియా కవరేజిపై నివేదికను ప్రచురించిన ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా నిజనిర్ధారణ బృందంపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడం శోచనీయం. ప్రజా సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహిస్తున్నారని, మతపరమైన భావాలను దెబ్బతీసే ఉద్దేశంతో ప్రకటనలు చేస్తున్నారని తదితర తప్పుడు ఆరోపణలతో ఈ ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. ఈ ఎఫ్‌ఐఆర్‌లో సీమా గుహ, భరత్ భూషణ్, సంజయ్‌కపూర్, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు సీమా ముస్తఫా పేర్లను పోలీసులు చేర్చారు.

గుజరాత్ మారణహోమంలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోడీ పాత్రను ఎత్తి చూపిన డాక్యుమెంటరీని రూపొందించి విడుదల చేసిన కొద్ది రోజుల్లోనే దేశంలోని బిబిసి కార్యాలయాలపై ఆదాయపు పన్ను దాడులు జరిగాయి. ఇవి కూడా పత్రికాస్వేచ్ఛకు ముప్పులో భాగంగానే పరిగణించక తప్పదు. 2014 నుంచి పాలనా విధానాల్లోని లోపాలను ఎత్తిచూపే పత్రికల పైన, పాత్రికేయుల పైన దాడులు విపరీతంగా సాగుతున్నాయనడానికి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం మన పత్రికా స్వేచ్ఛ ర్యాంకు దారుణంగా పడిపోయిందని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే సంస్థ బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ విడుదల చేసిన తన 21 వ నివేదిక ప్రకారం ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో మన దేశం 11 ర్యాంకులు కోల్పోయి, 150 నుంచి 161 స్థాయికి పడిపోయింది. అదే సమయంలో పాకిస్థాన్ 150 ర్యాంకులో నిలబడి పత్రికాస్వేచ్ఛలో మనకంటే మెరుగైన స్థానంలో ఉందని సూచించడం ప్రత్యేకించి గమనించవలసిన విషయం. తాలిబన్ల పాలన లోని అఫ్ఘానిస్థాన్ కూడా పత్రికా స్వేచ్ఛలో 152 ర్యాంకు సాధించుకుని మనకంటే మేలనిపించుకోవడం ఆశ్చర్యకరం.

మన దేశానికి పొరుగున ఉన్న భూటాన్ 90 వ ర్యాంకులో ఉండగా, శ్రీలంక కూడా మనకంటే గొప్పగా 135 వ స్థానంలో ఉంది. మన దేశంలో జర్నలిస్టులకు భద్రత అన్నది ఎడారిలో ఒయాసిస్‌లా తయారైంది. ఈ విషయంలో భారత్ 172 వ ర్యాంకుకు మహాపతనం చెందింది. మొత్తం 180 దేశాల్లో భారత్ 172 వద్దనే నిలిచి ఉందంటే మనకంటే జర్నలిస్టుల భద్రతలో కేవలం ఎనిమిది దేశాలే ఉన్నాయని తెలుస్తోంది. దేశంలో భావవ్యక్తీకరణకు అపరిమితమైన స్వేచ్ఛ ఉందని పాలకులు పైకి చెబుతుంటారు. కానీ దేశద్రోహం, పరువునష్టం వంటి చట్టాలు వ్యతిరేక మీడియా మీద ప్రయోగించడం ఎలాంటి పత్రికా స్వేచ్ఛ అనుకోవాలో అర్థం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని పాత్రికేయ సంఘాలన్నీ ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News